Reading Time: 2 minutes

నగర పోలీస్ కమిషన్ సజ్జనార్ ఇచ్చిన నోటీసులకు సమాధానంగా తన వద్ద ఉన్న సమాచారంతో జవాబు ఇస్తానని, ఆ తరువాత ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిపి సజ్జనార్ నోటీసులపై ఆయన ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగత దూషణలు చేయనని, చిల్లర భాష వాడనని, వాస్తవాలు దాచనని, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపబోనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెటిఆర్, హరీశ్ రావుకు సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చి సిట్ గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని ఖండించిన 12 గంటల్లోనే పోలీసులు ఇంటికి వచ్చిన తనకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆధారాలతో సహా సమాధానం ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధం కావాలని హెచ్చరించారని తెలిపారు. ప్రజా సమస్యలు, దౌర్జన్యాలపై గొంతెత్తడం తన హక్కు అని.. వార్నింగ్‌లకు భయపడబోనని అన్నారు.

సిట్ ఛీఫ్ సజ్జనార్ మీద ఎపిలో నమోదైన కేసులపై మరో సిట్ వేయాలని తాను డిమాండ్ చేసినట్లు నోటీసులో ఉందని, అది వాస్తవ విరుద్ధమని తోసిపుచ్చారు. తాను సిట్ ఛీఫ్ సజ్జనార్ మీద ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసుల మీద మరో సిట్ వేయాలని డిమాండ్ చేసినట్లుగా నోటీసులో ఉందని, ఇది వాస్తవ విరుద్ధం అని చెప్పారు. గతంలో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలో నాటి టిడిపి ఎంఎల్‌ఎ, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిన తరువాత, ఆంధ్రప్రదేశ్ నాయకుల ఫోన్లు తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని 2015 జూన్ నెలలో ఆంధ్రలో చాలా పోలీసు స్టేషన్లలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదయ్యాయని పత్రికల్లో చాలా వార్తలొచ్చాయని, ఆ సమయంలో ఆంధ్రలో కూడా ఒక సిట్ కూడా ఏర్పాటు అయ్యిందని తెలిపారు. ఆ కాలంలో నేటి సిపి సజ్జనార్ కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారిగా పనిచేశారు అన్న అవగాహన తనకు ఉందని, అందుకే ఆయన ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంపై వేసిన రెండో తెలంగాణ సిట్‌కు ఛీఫ్‌గా ఉండడం నైతికంగా కరెక్ట్ కాదు అని తన అభిప్రాయం చెప్పానని వివరించారు.

ఇది రాజ్యాంగం తనకు కల్పించిన హక్కు అని, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల ముందుకు ఈ మరుగున పడిన విషయాలను ప్రజల ముందుకు తీసుకరావాల్సిన కనీస బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యానించారు. పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయ క్రీడలో పావులుగా మారవద్దని సలహా ఇచ్చినట్లు తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పలు కుంభకోణాల(బొగ్గు కుంభకోణంతో సహా) మీద సిట్ వేయాలని డిమాండ్ చేశానని అన్నారు. నాటి డిజిపి, హోం సెక్రటరీ, సిఎస్ లాంటి అధికారులందరినీ విడిచిపెట్టి సిట్ అధికారులు కేవలం విశ్రాంత ఐపిఎస్ ప్రభాకర్ రావు, ఆయన కుటుంబాన్ని, ఆయనతో పనిచేసిన కానిస్టేబుళ్లు, బంధువులను వేధించడం అన్యాయమని చెప్పినట్లు వివరించారు. తాను సజ్జనార్ సహా ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదని… ఆ సంస్కృతి తనకు లేదని తెలిపారు.