Reading Time: < 1 minute

శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు అనుమానాస్పద పరిస్థితుల్లో తమ ఇంట్లో మృతి చెందారు. ఆ కుటుంబంలో నాలుగో సభ్యురాలైన వారి కుమార్తె ఆయేషా (6) అపస్మారక స్థితిలో పడి ఉండగా గుర్తించి, విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిని మీనక మధు (35), అతని భార్య మీనక సత్యవతి (30), వారి కుమారుడు మోషే (4)గా గుర్తించారు.వనజ గ్రామానికి చెందిన మీనక మధు(35), సత్యవతి(30) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కూతురు మాధురి చినమేరంగి కెజిబివిలో, రెండో కూతురు మోక్ష తాతగారి ఊరు జియ్యమ్మవలస మండలం బొమ్మికలో ఉంటూ చదువు కుంటున్నారు. మిగిలిన ఇద్దరు పిల్లలు మోస్య(4), అయేషా(6) తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు.స్థానికులు సమాచారం మేరకు  పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. జియ్యమ్మవలస సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, ప్రాథమిక దర్యాప్తులో చలిని తట్టుకోవడానికి రాత్రంతా గదిలో ఉంచిన బొగ్గుల కుంపటి పొగ పీల్చడం వల్ల కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఊపిరాడక మరణించారని వెల్లడైందని తెలిపారు. వారు తమ మంచం పక్కనే బొగ్గుల కుంపటిని పెట్టుకున్నారని ఆయన చెప్పారు. ఉదయం ఆలస్యమైనా కుటుంబ సభ్యులు నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా, మధు, సత్యవతి, మోషే మృతదేహాలు కనిపించాయని, ఆయేషా నేలపై అపస్మారక స్థితిలో పడి ఉందని గుర్తించారని ఆయన తెలిపారు.