
హైదరాబాద్: భారత్ -న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టి20ల్లో సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 82 పరుగులు, ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 76 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. 24 ఇన్నింగ్స్‌ల తరువాత సూర్య భారీ హాఫ్ సెంచరీ చేశాడు. 468 రోజుల తరువాత వరల్డ్ కప్ ముందు ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌ను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసించారు. బ్యాటింగ్‌లో కొన్ని మార్పులు చేసుకొని ఫామ్‌లోకి రావడం మంచి పరిణామం అని కొనియాడారు. మొదటి 11 బంతులు నెమ్మదిగా ఆడి తరువాత బ్యాట్ ఝుళపించారని, హాఫ్ సెంచరీని కేవలం 23 బంతుల్లో సాధించడం గ్రేట్ అని ప్రశంసించారు. స్పూప్ షాట్‌తో సిక్స్ కొట్టడంతో సూర్యను మించిన వారు లేరని, ఆ ఒక్క షాట్‌నే నమ్ముకోకుండా స్ట్రైట్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారని సునీల్ తెలిపారు. మిడిల్ ఆఫ్ ది బ్యాట్‌తో బంతిని కొట్టినప్పుడు బ్యాట్స్‌మెన్లలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని, సూర్యాలో అది కనిపించిందని మెచ్చుకున్నారు. తొలుత 22 బంతుల్లో 32 పరుగులు చేసిన సూర్య చివరలో 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి మొత్తం 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు.