
డెన్మార్క్ అనే తండ్రి, గ్రీన్‌లాండ్ అనే తన కుమార్తెను, తనకిచ్చి వివాహం చేయాలన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్. అందుకు తండ్రి ససేమిరా అంగీకరించటం లేదు. గ్రీన్‌లాండ్‌ను తన కిస్తే కన్యాశుల్కం చెల్లించేందుకైనా సిద్ధమని ట్రంప్ ప్రకటించగా, తండ్రి అందుకు కూడా ఒప్పుకోవటం లేదు. దానితో ఆ కన్యను బలప్రయోగంతో అపహరించగలనన్నది వరుడు కాదలచుకున్న వారి హెచ్చరిక. దానితో గ్రామంలో కలకలం చెలరేగగా, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, పూజారి వేషధారణతో మధ్యవర్తిగా రంగ ప్రవేశం చేసి, ట్రంప్, గ్రీన్‌లాండ్‌లకు ‘రాక్షస వివాహ’ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజా వార్తలు అందేసరికి డెన్మార్క్ ఇంకా కాదంటున్నది. ఆపని చేసేందుకు ‘నాటో’ ఎవరని ప్రశ్నిస్తున్నది.
ఈ వ్యాసం వెలువడే సరికి ఏమి జరగవచ్చు? ఏమైనా జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఇంతకూ పూజారి రాజీ ప్రతిపాదన ఏమిటి? మార్క్ రుట్టే ఒక పాత నమూనాను తవ్వి తీసారు. మధ్యధరా సముద్రంలోని సైప్రస్ దీవి బ్రిటిష్ వలసగా ఉండేది. ఆ వలస పాలన నుంచి సైప్రస్ 1960లో స్వాతంత్య్రం పొందినపుడు, అదంతా కీలక ప్రాంతం అయినందున ఆ దీవిపై రెండు చిన్న ప్రాంతాలను మాత్రం తమకు వదలివేయాలని బ్రిటన్ కోరింది. అందుకు సైప్రస్ సమ్మతించింది. ఆ ప్రాంతాలు అక్రోటిరి, ఢెకేలియా. అవి దక్షిణాన ఒకటి, తూర్పున ఒకటి విసరివేసినట్లుంటాయి. వాటిపై సార్వభౌమత్వం బ్రిటన్ ది. అక్కడ దాని సైనిక స్థావరాలుంటాయి. అక్కడి ప్రజలను అదే పాలిస్తుంది. సరిగా అదే పద్ధతిలో ట్రంప్ కోరుతున్నట్లు మొత్తం గ్రీన్‌లాండ్‌పై సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించకున్నా, కనీసం అక్కడ లోగడ అమెరికా స్థావరాలు ఉండిన ప్రాంతాల వరకు సార్వభౌమాధికారం అప్పగించి రాజీ చేసుకోవచ్చునన్నది నాటో పూజారి రాజీమార్గం.
ఇది దావోస్‌లో ఒక అర్ధరాత్రి మంతనాలలో ముందుకు వచ్చిన మీదటనే, తాను గ్రీన్‌లాండ్ స్వాధీనానికి బలప్రయోగం జరపబోనంటూ ట్రంప్ ప్రకటించారు. యూరప్‌పై 10 శాతం సుంకాలు ఇక ఉండవన్నారు. ఇంతకూ ఇది డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ల అంగీకారంతో జరిగిందా? నాటోకు అటువంటి అధికారం లేదనే తిరస్కారాలు ఇప్పటికే మొదలయ్యాయి. చివరకు ఏమి జరిగేదీ తెలియదు. గ్రీన్‌లాండ్‌పై అమెరికా స్థావరాల కోసం 1951లోనే జరిగిన సైనిక ఒప్పందం ఎట్లాగూ ఇంకా అమలులో ఉన్నందున, ఆ కొద్దిపాటి భూభాగాలను వారికి సార్వభౌమాధికారంతో అప్పగిస్తే రాగల నష్టం ఏమిటని డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ల భావించి రాజీ పడవచ్చునా? లేక, అటువంటి ప్రతిపాదనలను ట్రంప్ సామరస్య పూర్వకంగా చేయటానికి బదులు తమను బెదరించటం, తమ ఆత్మగౌరవాన్ని అవమానించటం, విషయం చిలికి చిలికి గాలివానగా మారి మొత్తం యూరోపియన్ యూనియన్ దీనినొక సవాలుగా తీసుకోవటం, ఘర్షణ వాతావరణం ఏర్పడటం, ట్రంప్ 10 శాతం, 25 శాతం టారిఫ్ ప్రకటనలు, వాటిని 100 శాతమైనా చేస్తాననటం, తాజాగా కొద్ది రోజుల క్రితం యూరప్ ఎదురు సుంకాల ఆలోచనలు, గ్రీన్‌లాండ్‌కు సైనిక దళాల రవాణా, ఒక అమెరికా యుద్ధ విమానం రాకడ వంటి పరిణామాలన్నీ ప్రపంచం చూసినవే.
ఇంతకూ సైప్రస్‌లో బ్రిటిష్ స్థావరాలవలే గ్రీన్‌లాండ్‌లో అమెరికన్ స్థావరాలున్నాయా? రెండవ ప్రపంచ యుద్ధ తర్వాత అప్పటి సోవియెట్ యూనియన్‌తో ప్రచ్ఛన యుద్ధ కాలంలో గ్రీన్‌లాండ్ తూర్పు, పడమర, పశ్చిమ ప్రాంతాలతో కలిపి సుమారు పన్నెండు వైమానిక స్థావరాలుండేవి. ప్రచ్ఛన్న యుద్ధం 1991లో సోవియెట్ పతనంతో ఆగిపోగా ఆ స్థావరాల అవసరం లేకుండాపోయింది. అట్లాగే, అప్పటి రహస్య భూగర్భ అణుశక్తి కేంద్రం ఒకటి కూడా. అది ఇటీవల నాసా అన్వేషణలో బయటపడింది. అయితే, పిటూఫిక్ అనే చోట ఉపరితల సైనిక స్థావరం మాత్రం నేటికీ కొనసాగుతున్నది. ఆ స్థావరాన్ని అమెరికాకు అప్పగించిన 1951 నాటి ఒప్పందం ప్రకారం, గ్రీన్‌లాండ్‌పై సైనిక కార్యకలాపాలు ఏమైనా జరపవచ్చు. అందుకోసం డెన్మార్క్‌తో “సంప్రదింపులు” తప్ప వారి “అంగీకారం” అంటూ అవసరం లేదు. వాస్తవానికి అటువంటి వీలును ఆధారం చేసుకునే బదులు మొత్తం గ్రీన్‌లాండ్ సార్వభౌమాధికారాన్ని ట్రంప్ కోరటంతోనే సమస్య తలెత్తింది.
ఇపుడు నాటో సెక్రటరీ జనరల్ పూజారి వేషధారణతో ట్రంప్, గ్రీన్‌లాండ్‌లకు సాధారణ వివాహమో, రాక్షస వివాహమో జరగవచ్చునా అన్నది ప్రస్తుత ప్రశ్న. అది ఈ వ్యాసం వెలువడే సమయానికి తేలిపోవచ్చునా? చెప్పలేము. ఒకవేళ రాజీ అన్నది సూత్రరీత్యా జరిగినా, అప్పుడ మొత్తం గ్రీన్‌లాండ్ కాకున్న ట్రంప్ ఏమేమి కోరవచ్చును? ఒకప్పటి వైమానిక స్థావరాలు అన్నీ కావాలని, ప్రస్తుత స్థావరాలనూ ఇవ్వాలని, మైనింగ్ వనరులన్నింటిపై అత్యధిక హక్కులు వదలాలని, గ్రీన్‌లాండ్ ఉత్తరాన గల ఆర్కిటిక్ ప్రాంతం మొత్తం కూడా తమ అజమాయిషీలో ఉండాలని డిమాండ్ చేయగల అవకాశం ఉంటుంది. నిజానికి, గ్రీన్‌లాండ్ తీరప్రాంతం నుంచి కొంత దూరం వరకే హక్కులుంటాయి. ఆ తర్వాత ఆర్కిటిక్ అంతా అంతర్జాతీయ సముద్ర ప్రాంతం. అంతర్జాతీయ చట్టాలే వర్తిస్తాయి. సముద్రయానానికి గాని, సముద్ర గర్భ వనరుల వెలికితీతకు గాని.
పోతే, ఈ వివాదం తలెత్తిన తర్వాత వెలుగులోకి వస్తున్న విషయాలు కొన్నున్నాయి. గ్రీన్‌లాండ్ పట్ల అమెరికా ఆసక్తి ట్రంప్‌తో మొదలు కాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం (193945)లో హిట్లర్‌ను ఓడించిన తర్వాత సోవియెట్ యూనియన్ మరింత బలమైనదిగా కన్పించటంతో కీలక ప్రాంతంలో గల గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ నుంచి ఖరీదు చేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ప్రయత్నించారు. అందుకు పది కోట్ల డాలర్లు చెల్లిస్తామన్నారు. కాని డెన్మార్క్ అసలు అమ్మేందుకే ఒప్పుకోలేదు. తర్వాత ట్రంప్‌కు తన మొదటి విడత పాలనా కాలం (201721) లోనే ఈ ఆలోచన వచ్చింది. అయితే, ట్రూమన్ ఆలోచనకు, ట్రంప్ దృష్టికి మధ్య ఒక చిత్రమైన తేడా ఉంది. ట్రూమన్ ది సామ్రాజ్యవాద ప్రయోజనం కాగా, ట్రంప్ ది కేవలం వ్యాపార దృష్టి. రష్యా, చైనాల నుంచి రక్షణ అన్నది ఒక ముసుగు. ‘ద డివైడర్’ అనే పుస్తకం కోసం ఆయన 1921లో ఇచ్చిన ఇంటర్వూలో అన్నది గమనించండి. “ఒకసారి మ్యాప్‌ను చూడు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. ఒక మూలన ఒక దుకాణం కనిపిస్తుంది. నేను కట్టే పెద్ద బిల్డిండ్ కోసం ఆ దుకాణపు స్థలం కావాలనిపిస్తుంది. ఇందులోనూ అంతకన్న తేడా లేదు. దీని (గ్రీన్‌లాండ్) సైజు ఎంతున్నదో చూడు. అది అమెరికాలో భాగం కావాలి.” ఇదీ తాను అన్నది. గ్రీన్‌లాండ్‌పై దృష్టి పెట్టాలని ట్రంప్‌కు నూరిపోసింది తన స్కూల్ మేట్ రోలండ్ లాడర్. ఆయన ఒక బిలియనీర్ వ్యాపారి. అదే ప్రకారం ట్రంప్ తన మొదటి హయాంలో జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ను, గ్రీన్‌లాండ్ ఖరీదుకు ఒక పథకం తయారు చేయమన్నారు. ఆయన అది సాధ్యం కాదన్నా ఊరుకోలేదు. కావాలంటే తమ ప్యూర్టోరి కోనును ఇచ్చి గ్రీన్‌లాండ్‌ను తీసుకుందామన్నారు. ఆ కథనమంతా వాల్‌స్ట్రీల్ జర్నల్‌లో వెల్లడికావటంతో ఆందోళన చెందిన డెన్మార్క్ వెంటనే అందుకు నిరాకరించింది.
అయినా ట్రంప్ పట్టువదలని విక్కమార్కుని వలే, 2024లో తిరిగి ఎన్నిక కాగానే, గ్రీన్‌లాండ్ కావాలంటూ ఒక పోస్ట్ పెట్టారు. దీనంతటి బట్టి ట్రంప్ ప్రయోజనాలేమిటో, స్వభావమేమిటో గ్రహించవచ్చు. ఇంతే విచిత్రంగా ఆయన ఒక కొత్త వాదన మొదలు పెట్టారు. గ్రీన్‌లాండ్‌కు వందల సంవత్సరాల క్రితం డెన్మార్క్ పడవలు ఎపుడుపోయాయో, అమెరికా కూడా అపుడు వెళ్లాయని, అసలు గ్రీన్‌లాండ్‌తో డెన్మార్క్‌కు లిఖిత ఒప్పందం ఏమైనా ఉందా అని అంటున్నారాయన. ఆ కాలంలో నిజానికి అమెరికా అనే దేశమే లేదు గనుక ట్రంప్ వాదన తప్పు. ఆ మాటకు వస్తే, యూరోపియన్లు మొదట అమెరికా తూర్పుతీరానికి వచ్చి స్థానికులపై మారణకాండ సాగిస్తూ పశ్చిమం వైపు తరిమివేస్తూ వారి యావత్ ఖండాన్ని ఆక్రమించినప్పుడు ఒప్పందాలేమైనా జరిగాయా? ఏ పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశమైనా ప్రపంచాన్ని ఒప్పందాలతోనే వలసలుగా మార్చుకున్నదా?
– టంకశాల అశోక్ ( దూరదృష్టి)
(రచయిత సీనియర్ సంపాదకులు)