Reading Time: 3 minutes

విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం

పాత్రత్వాద్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్‌॥

అంటే విద్య వినయాన్నిస్తుంది, వినయం పాత్రతనిస్తుంది, పాత్రతతో ధనం లభిస్తుంది, ధనంతో ధర్మం, దానితో సుఖం కలుగుతాయి- అని ఒక శ్లోకం వివరిస్తుంది. విద్య లేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు. కొందరినే కాల్చగలదు గన్, కానీ ఎందరినో మార్చగలదు పెన్. విద్య అంటే చీకటిలో నుండి వెలుగులోకి. విద్య అంటే అన్నిటికన్నా గొప్ప జ్ఞానాయుధం. ఎపిజె అబ్దుల్ కలాం అభిప్రాయం ప్రకారం ‘అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది, సృజనాత్మకత ఆలోచనలకు దారితీస్తుంది, ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది, జ్ఞానం మనల్ని గొప్పవారుగా చేస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం. ఐక్యరాజ్యసమితి విద్య అవసరం గుర్తించి అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే పిల్లలకు విద్య నాణ్యత ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఉంటుంది. కోట్లాదిమంది పిల్లలు ఇప్పటికీ విద్య అనే ఈ ప్రాథమిక మానవ హక్కును పొందలేకపోతున్నారు. అందరికీ ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఉత్తమమైన విద్యా సంస్కరణల అమలు కోసం ప్రచారం కల్పించడానికి, సామాన్యుడికి సైతం విద్య అందుబాటులో ఉండడానికి ప్రతి దేశంలో విద్యా దినోత్సవాన్ని జరుపుకొనుచున్నారు.

విద్య మానవ హక్కు, ప్రజా బాధ్యత, ప్రజా శ్రేయస్సులైనా ఈ మూడింటినీ గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ శాంతియుత అభివృద్ధి కోసం విద్యను దృష్టిలో ఉంచుకొని 2018 డిసెంబర్ 3న ‘జనవరి 24 ను అంతర్జాతీయ విద్య దినోత్సవంగా’ ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదింప చేసుకుంది. విద్య లేకుండా ఏ దేశం అభివృద్ధి సాధించలేదు. విద్యా అభివృద్ధి కాకుండా మనుగడ కూడా కష్టం. నాణ్యమైన, బాధ్యతాయుతమైన విద్య లేకుండా ఏ దేశం లింగ సమానత్వం సాధించడం కష్టం. కోట్లాది మంది పిల్లలు, యువత, పెద్దలు విద్యాబుద్ధులు నేర్చుకొని నిరక్షరాస్యతను తరిమి కొట్టినప్పుడే పేదరికం నిర్మూలించి విజయం సాధించగలరు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు 25 కోట్ల మంది పిల్లలు, యువకులు పాఠశాలకు వెళ్లి చదువుకోలేకపోతున్నారు. సుమారు 76.5 కోట్ల మంది పెద్దలు నిరక్షరాసులుగా ఉన్నారని తెలుస్తున్నది.

భారత దేశంలో తల్లిదండ్రులు సగటున ఒక విద్యార్థిపై ఒక అంచనా ప్రకారం 18,479 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది. తమ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు భారతీయులు 2024లో అక్షరాల 3,78,400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కేంద్రప్రభుత్వం 2025- 26 బడ్జెట్లో విద్యకు నిధులు పెంచి కేటాయించినా, ప్రపంచ సగటుతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ప్రపంచ సగటు విద్యపై 4.48% గా ఉంటే, భారత సగటు మాత్రం 4% గా ఉంది. యూరోపియన్ యూనియన్‌లో జిడిపి పరంగా చూసినప్పుడు స్వీడన్ అత్యధికంగా 6.9%, బెల్జియం 6.2%, పిన్‌లాండ్ 6%. చిన్న దేశం కిరిబతి 14.2% అత్యధికం. అమెరికాలో కె -12 విధానం అంటే కిండర్ గార్డెన్ టు 12వ తరగతి వరకు (6 సంవత్సరాల ప్రాథమిక విద్య, 4 సంవత్సరాల జూనియర్ హైస్కూల్, 2 సంవత్సరాల సీనియర్ హైస్కూల్ కలుపుకొని). ప్రధానంగా విద్యా నిధులు స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తాయి, ఫెడరల్ ప్రభుత్వం (8-10%) సహాయపడుతుంది. భారతదేశంలో విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టం చేశారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలవుతున్నది. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలమీద ఉంటుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. స్కూలు నిర్వహణ కమిటీ లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్‌ను నిరాకరించటానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25% సీట్లను బలహీన, పేదవర్గాలకు కేటాయించాలి. వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. నిధులను 55-:45 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలి. మన దేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఉన్నత విద్య కూడా నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని దేశాలలో మాత్రమే పరిశోధనలకు నిధులు సరిపడా అందుతున్నాయి. చాలా దేశాలలో విద్యార్థులు ఉన్నత విద్యలో చేరలేకపోతున్నారు. కారణం ఉన్నత విద్య ఖరీదైనది.

ఉన్నత విద్య కూడా సరైన విధంగా ప్రోత్సహించేటట్లు చేయడం అంతర్జాతీయ సమాజంపై ఉన్నది. కావున విద్య ఏదైనా దానికి విలువలు జోడిస్తూ పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మాద్యమిక, స్నాతక, స్నాతకోత్తర, పరిశోధక, పరిశోధన కొత్తర విద్యలను అన్ని స్థాయిలలో ప్రోత్సహించినప్పుడే సంపూర్ణమైన విద్య అందుతుంది. ఈ రోజు విద్యను భాగస్వామ్యంతో ఒక ప్రజా ప్రయత్నంగా, ఉమ్మడి శ్రేయస్సుగా ఎలా బలోపేతం చేయాలో, డిజిటల్ పరివర్తనను ఎలా నడిపించాలో, ఉపాధ్యాయులకు ఎలా మద్దతు ఇవ్వాలో, ఎలా అబివృద్ధి చేయాలో విద్య నిర్ణయిస్తుంది. విద్యార్థులకు విద్యను అందించే ఉపాధ్యాయులపై ఇతర పనుల ప్రభావాన్ని తగ్గించి వారిని బోధనలో మాత్రమే నిమగ్నం చేయాలి. ఉపాధ్యాయులకు మన దేశంలో స్థానిక, పురపాలక, సాధారణ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్య బోధన కొంటుపడుతుంది.

అప్పుడప్పుడు జనగణన విధులు కూడా ఉపాధ్యాయులకు అప్పచెప్పుతున్నారు. కానీ ఇది విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఉపాధ్యాయులు కూడా బోధన విరుద్ధమైన విధులు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడికి లోనై బోధనపై నిరాసక్తత ఏర్పడే ప్రమాదం ఉన్నది. అంతర్జాతీయ సమాజం విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంలో సహాయపడుతూ చదువుకున్న ప్రతి వాడికీ ఉపాధి దొరికేటట్లు చూడాల్సిన బాధ్యత ఉన్నది. విద్యను అందించడంలో ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా ముఖ్యం. విద్యార్థులు గురువులను గౌరవించే విధంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్పాలి అప్పుడే విద్యార్థి గురువు మధ్య గురుశిష్య బంధం బలపడుతుంది. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి విద్యా బోధన సక్రమంగా సాగడానికి అనుకూల వాతావరణ ఏర్పడుతుంది. కావున సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి పాటుపడాలి, సమాజాభివృద్ధికి తోడ్పడాలి. అప్పుడే ఈ సమస్త ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుంది.

– డా. కావలి చెన్నయ్య ముదిరాజ్

9000481768