
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షునిగా పగ్గాలు పట్టిన దగ్గర నుంచీ గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా చేజిక్కించుకుంటానన్న మొండి పట్టుదలతో ఉంటున్నారు. బుధవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి గ్రీన్‌లాండ్‌పై తనకు ఎంత ఆకాంక్ష ఉందో బయటపెట్టారు. ప్రపంచాన్ని రక్షించేందుకు ఒక ఐస్‌ముక్కను అడుగుతున్నామని, కానీ నాటో దేశాలు దానిని వదలిపెట్టమని చెబుతున్నారని, బలప్రయోగం చేస్తే ఎవరూ కాదనలేరని, కానీ అలా చేయబోమని ఒక విధంగా బెదిరించారు. అమెరికా, చైనా, రష్యా మధ్య ఉండటం వల్ల వ్యూహాత్మకంగా మాకెంతో అది కీలకమని, అంతే తప్ప ఆ మంచుకింద భారీగా ఉన్న అరుదైన ఖనిజాల కోసం కాదని చెప్పుకొచ్చారు. నాటో కూటమి లోని డెన్మార్క్‌లో పాక్షిక స్వయం ప్రతిపత్తిగల గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక చర్య తప్పదని బెదిరించి ఐరోపా యూనియన్ దేశాలను రెచ్చగొట్టారు. డెన్మార్క్ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో మిలిటరీ కత్తిని వేలాడదీశారు. యూరప్ దేశాలన్నీ దీనికి తిరుగుబాటు చేసి ముక్తకంఠంతో వ్యతిరేకించేసరికి వెనక్కు తగ్గారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో డెన్మార్క్‌ను అమెరికా కాపాడినా ఆ దేశానికి కృతజ్ఞత లేదని నిందించారు. గ్రీన్‌లాండ్‌పై టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు.
మొత్తం మీద కొంతసేపు బెదిరింపు, మరికొంతసేపు బుజ్జగింపు ధోరణితో గ్రీన్‌లాండ్ ఎట్టకేలకు కావాలన్న ఆకాంక్షను మాత్రం ట్రంప్ విడిచిపెట్టడం లేదు. 57000 మంది జనాభాతో ప్రపంచం లోనే అతిపెద్ద ద్వీపం అయిన గ్రీన్‌లాండ్ డెన్మార్క్ ప్రభుత్వ నియంత్రణ లోని స్వయం పాలిత భూభాగం. 18వ శతాబ్దంలో ఈ ద్వీపం డేన్స్ వలస పాలకుల అధీనంలో ఉండేది. ఆ సమయంలో ఐరోపాతో సమన్వయం పాటించేది. భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో ఇదో భూభాగం. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ముట్టడిలో డెన్మార్క్ ఉన్నప్పుడు అమెరికా స్వల్పంగా దీనిని ఆక్రమించి రక్షించింది. యుద్ధం తరువాత దీని ప్రాంతీయ భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యతను అమెరికా గుర్తించింది. ఈ గత చరిత్రను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఇప్పుడు గ్రీన్‌లాండ్ తమకే చెందాలని దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ ద్వీపంపై అమెరికా విమాన స్థావరాన్ని నిర్వహిస్తున్నా, ఈ ద్వీపంపై పూర్తి స్వాతంత్య్రం సాధించాలన్న లక్షం తో డెన్మార్క్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జాతీయ భద్రత, ప్రపంచం మొత్తం మీద స్వేచ్ఛ, తదితర ప్రయోజనాల దృష్టా గ్రీన్‌లాండ్‌పై నియంత్రణ అధికారం తప్పనిసరిగా ఉండాలని అమెరికా ఆశిస్తున్నట్టు గత రెండేళ్లుగా ట్రంప్ చెబుతున్నారు.
గ్రీన్‌లాండ్ ద్వీపానికి ఒకవైపు అట్లాంటిక్, మరోవైపు ఆర్కిటిక్ జలాలు చుట్టిముట్టి ఉన్నాయి. వాతావరణ మార్పులకు, భూతాపానికి, ఆర్కిటిక్ సముద్రం లోని హిమానీ నదులు, మంచు ఫలకాలు కరుగుతుంటాయి. దీనివల్ల నౌకా రవాణాకు కొత్త మార్గాలు ఏర్పడుతుంటాయి. దీంతో సముద్ర వాణిజ్యం విస్తరించడానికి ఎక్కువగా వీలవుతుందని అమెరికా ఆశపడుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ఆర్కిటిక్ జలాల్లో నూతన నౌకా రవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి రష్యా, చైనా దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇది అమెరికాకు కన్నెర్రగా ఉంటోంది. స్కాండినేవియా సమీపానగల బారెంట్స్ సముద్రం నుంచి అలస్కా సమీపాన గల బెరింగ్ జలసంధి వరకు ఈ మార్గం 5600 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో రష్యా చైనా సహకార ఒప్పందం పెద్ద సవాలు కావడంతో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటేనే గానీ తమ ఆధిపత్యం సాగబోదని అమెరికా భావిస్తోంది.
గ్రీన్‌లాండ్ స్వాధీనమైతేనే ఈ వ్యూహాత్మక జలాల్లో ఎవరు రవాణా సాగించాలో, ఎవరు ఆపరేట్ చేయాలో నిర్ణయించే అధికారం అమెరికాకు కలుగుతుంది. గ్రీన్‌లాండ్ ఖనిజాల కోసం తన తాపత్రయం కాదని పైకి ట్రంప్ చెబుతున్నప్పటికీ, ఈ ద్వీపంలో అపురూప ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయన్న మాట మాత్రం వాస్తవం. 2025 లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 35 కీలకమైన ఖనిజాల్లో 25 ముడి ఖనిజాలు గ్రీన్‌లాండ్‌లో నిక్షిప్తమై ఉన్నాయని తేలింది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల్లో ఈ ఖనిజాలను వినియోగిస్తారు. 28,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రీన్‌లాండ్ మంచు ఫలకలు కరుగుతుండడంతో చమురు, గ్యాస్, ఇతర కీలకమైన ఖనిజాలను తవ్వితీయడం సులువవుతుంది. ప్రపంచం మొత్తం మీద చైనా కీలకమైన ఖనిజాల ఎగుమతి, ఉత్పత్తిదారుగా ఉంటోంది. గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయగలిగితే చైనాకు గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది.
దేశాల సార్వభౌమత్వాన్ని గ్రీన్‌లాండ్‌తోసహా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో పేర్కొన్న మొదటి ప్రమాణానికి అమెరికా గండికొడుతోంది. అలాగే నాటో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. ఐక్యరాజ్యసమితి పొందుపరిచిన సముద్ర పరిరక్షణ చట్టం మేరకు ప్రపంచ దేశాలన్నిటికీ సమాన వినియోగ హక్కు కల్పించేవిగా ఆర్కిటిక్ జలాలు ఉంటున్నాయి. కానీ ట్రంప్ పాలసీలు వీటిని ఖాతరు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా గ్రీన్‌లాండ్‌పై టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తుండటంపై ఐరోపా యూనియన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్‌డెర్ తీవ్రంగా ఆక్షేపించారు. ఐరోపా కూటమిదేశాలపై ఎలాంటి టారిఫ్‌లు విధించబోమని గత ఏడాది ట్రంప్ ప్రకటించారని, ఆ విశ్వసనీయత ఇప్పుడేమైందని ధ్వజమెత్తారు. ఐరోపా యూనియన్, అమెరికా గత జులైలో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఆ ఒప్పందం అటకెక్కినట్టేనా అని ఉర్సులా ప్రశ్నించడం ఈ సందర్భంగా గమనార్హం.