
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ చేయించి పారిశ్రామికవేత్తల నుంచి పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు సేకరించారా అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్‌ను సిట్ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (ప్రత్యే క దర్యాప్తు బృందం) విచారణకు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో జరిగిన విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయం త్రం వరకు ఆరు గంటల వరకు దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. కెటిఆర్‌ను విచారణ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి లు ప్రశ్నించారు. విచారణలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్‌కు బీఆర్‌ఎస్ సేకరించిన పార్టీ ఫండ్ కు లంకే పెట్టి కెటిఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది.ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బృందం వ్యాపారులను బెదిరించడం
ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు సేకరించడంపై సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు కెటిఆర్ ఘాటుగా సమాధానమిస్తూ మరి మా పార్టీకి ఏ ఏ కంపెనీలు అయితే ఇచ్చాయో, అవే కంపెనీలు బిజెపి, కాంగ్రెస్‌కి కూడా ఇచ్చాయి కదా, మరి వారిని ఎవరు బెదిరించారు అని కెటిఆర్ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. భూముల కేటాయింపు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నిస్తూ టిఎస్‌ఐసిసి కేటాయించిన భూములపై ప్రశ్నించగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు, భూముల కేటాయింపునకు సంబంధం లేదని, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కెటిఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా టెలిఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం లేని పలు ప్రశ్నలను సిట్ అధికారులు అడగగా ఆ సందర్భంగా కెటిఆర్‌కు వారికి మద్య వాగ్వివాదం జరిగినట్లు తెలిసింది. కేవలం వదంతులు, ఊహజనితమయిన పుకార్ల చుట్లూ ప్రశ్నలు తిప్పడం తప్ప ఈ కేసుకు సంబందం లేని ప్రశ్నలను ఎందుకు అడుగుతున్నారని కెటిఆర్ అధికారులను నిలదీసినట్లు తెలిసింది. సిట్ అధికారుల ప్రశ్నలకు ధీటుగా కెటిఆర్ ప్రశ్నించిన ప్రతి సారి ఈ అంశంతో కేసుకు సంబంధం ఉంది దానికి సంబంధించిన వివరాలు మేము చెప్పలేం అంటూ అధికారులు దాటవేసినట్లు సమాచారం.
అలాగే హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్‌కు సబంధించి సిట్ అధికారులను కెటిఆర్‌ఏ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన సమాచారం తమకు లేదని, తాము ఎలాంటి లీకులు ఇవ్వలేదని, వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనికి కెటిఆర్ స్పందిస్తూ కేవలం లీకులిచ్చి నా వ్యక్తిత్వ హననం ఇన్ని రోజులు చేశారు. దానికి మీరు బాధ్యత వహిస్తారా అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ అంశం సంబంధించి అధికారికంగా ప్రకటన ఇవ్వకుండా, సమావేశం పెట్టకుండా ఇన్ని పుకార్లు, వార్తలు ఎలా బయటకు వచ్చాయని కెటిఆర్ నిలదీసినట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యహారాలను ఎవరు చూస్తారని కూడా వారు ప్రశ్నించగా, ఈ అంశం ఫోన్ ట్యాపింగ్‌తో సంబందం లేనప్పటికీ మీరు ఎలా అడుగుతారని, కేవలం తనను దేనికయితే నోటీసులు ఇచ్చారో దాని గురించి మాత్రమే అడగండి అని కెటిఆర్ తెలిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కెటిఆర్ నన్ను ఎందుకు పిలిచారు, సాక్షిగా పిలిచారా, ఏ కారణంగా పిలిచారో చెప్పాలని కూడా ప్రశ్నించగా, కేవలం విచారణకు మాత్రమే పిలిచినట్లు సిట్ అధికారులు సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.కెటిఆర్ పర్యటనలు, సోషల్ మీడియా, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేనప్పటి నిర్ణయాలు, పలు వ్యక్తుల పేర్లు చెప్పి వారితో ఉన్న సంబంధాలు, పరిచయాల పైన సిట్ అధికారులు పదే పదే ప్రశ్నించినట్లు తెలిసింది.
ఈ విచారణ మొత్తంగా వాటి చుట్టే తిరిగినట్లు సమాచారం. మొత్తంగా పదుల సంఖ్యలో కొందరి వ్యక్తుల పేర్లు చెప్పి వీరు మీకు తెలుసా, వారితో ఎప్పుడయినా మాట్లాడారా, వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వంటి తదితర ప్రశ్నలను పదే పదే సిట్ అధికారులు అడిగినప్పటికీ కెటిఆర్ వాటికి ధీటుగా సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా ఉండగా ఇదే కేసులో కెటిఆర్‌ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, కెటిఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు. పోలీస్ స్టేషన్‌కు రెండువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ వెలుపల చోటుచేసుకున్న ఆందోళనల పరిణామాలతో మరింత పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్, ఏఆర్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కెటిఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రహదారి వెంట పలువురు కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి, సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో త్వరలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక వ్యక్తి ఒకరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సిట్ వర్గాల సమాచారం.