
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో సో లార్ పవర్‌ప్లాంట్‌లోనూ మరో స్కామ్ బయటపడిందని, 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద కుంభకోణం జరిగిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మూ డు వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే ది ఉంటే తమ అనుచరులకు కట్టబెట్టడానికి, పో టీ తగ్గించడానికి ఎంఎస్‌ఎంఇలు పాల్గొనకుండా ఉండేందుకు మూడు సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని ఆరోపించారు. ఎంఎస్‌ఎంఇలు పాల్గొనకూడదని మూడింటికి కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారని, సోలార్ పవర్ టెండర్ అనుమతులు కఠినం చేస్తూ సైట్ విసిట్ సర్టిఫికెట్ అనే నిబంధన పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం అనుకున్న వారికి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చారని ఆరోపించారు. దేశంలో 1 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తికి సగటున రూ.3 నుంచి 3.5 కోట్లు అయితే సింగరేణి భూమి ఇచ్చి మరీ రూ.5 కోట్లకు గోల్టి కంపెనీకి టెండర్ కట్టబెట్టారని అన్నారు. అలాగే 107 మెగావాట్ల కోసం రూ.214 కోట్లు అదనంగా చెల్లించగా, మరో టెండర్‌లో 67 మెగావాట్లకు రూ.480 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. సింగరేణిలో జిలిటెన్ స్టిక్స్ ఖర్చునూ తమ వారి కోసం రేవంత్‌రెడ్డి 30 శాతం పెంచారని ఆరోపించారు. ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తి చేయడానికి మూడున్నర కోట్లు అవుతుందని, పైగా భూమి కూడా సోలార్ కంపెనీలదే ఉంటుందని చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఒక మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తికి రూ.3 కోట్లు అవుతుందని, రాష్ట్రంలో మాత్రం ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తికి రూ.5.04 కోట్లు ఇచ్చారని, అదనంగా సింగరేణి భూములు కూడా ఇచ్చారని ఆరోపించారు. సింగరేణిలో సోలార్ పవర్ ఉత్పత్తికి దాదాపు రూ.200 కోట్లు అదనంగా చెల్లించారని పేర్కొన్నారు. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగిందని, నెంబర్ 3 సోలార్ పవర్ స్కాం.. 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ అని పేర్కొన్నారు. దాదాపు ఏడు కోట్లకు ఒక మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ ప్లాంట్‌ను కట్టపెట్టారు.. నేషనల్ ఆవరేజ్ కంటే ఇది రెట్టింపు వ్యయం అని చెప్పారు. బొగ్గు కుంభకోణాన్ని బిఆర్‌ఎస్ బయటపెట్టిన తర్వాతే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష చేస్తున్నారని చెప్పారు. 480 కోట్లకు వారికి కావలసిన కంపెనీకి కట్టబెట్టారని, ఈ కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనలు మార్చి తమ అనువాయులకు కట్టబెట్టారని అన్నారు. అక్కడ 250 కోట్లు ఇక్కడ 250 కోట్లు నేరుగా చేతులు మారాయని, 500 కోట్లు అదనంగా చెల్లింపులు జరిగాయని తెలిపారు. టెండర్లు వేసిన వారితో సిఎం బావమరిది హోటళ్లలో భేటీ అవుతున్నారని ఆరోపించారు. బిడ్లను తెరిచే ప్రక్రియ ఐదారుసార్లు ఎందుకు వాయిదా పడుతోందని ప్రశ్నించారు. నాడు సింగరేణి సిరుల గనిగా ఉండేదని, నేడు సింగరేణి సృజన్ గనిగా మారిందని విమర్శలు చేశారు.
మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు. మంత్రుల పంచాయతీ కాంగ్రెస్‌కు ఉరితాడులా మారిందని ఆక్షేపించారు. సృజన్ వ్యవహారం బయటపెట్టిన తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేదని విమర్శించారు. బావమరిది సృజన్ రెడ్డి కోసం చేసిన ఈ కుంభకోణం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిందని అన్నారు. మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిందని, ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. నాడు కోల్ స్కాం యుపిఎ ప్రభుత్వ పతనానికి కారణమైందని ప్రస్తావించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కోల్ స్కాం నాందిగా మారిందని తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి బామ్మర్థి బాగోతం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు పంపించారని చెప్పారు. యుపిఎ ప్రభుత్వంలో కోల్ స్కాం 1,50,000 కోట్లు అని, అది మొత్తం దేశాన్ని కుదిపేసిందని చెప్పారు. ఈ గండం గట్టేక్కేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు బిజెపితో కుమ్మక్కై ఈ సిట్ల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఈ డ్రామాలో భాగంగా మూడు రోజుల క్రితం తనకు, తాజాగా కెటిఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో జివి రెడ్డి అనే ఒక డైరెక్టర్ 30 శాతం ఎక్కువ రేటుకు కొనడానికి నిరాకరిస్తే ఆ ఒత్తిడికి ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారని చెప్పారు. మరో డైరెక్టర్ వికె శ్రీనివాస్ సంతకం పెట్టడానికి నిరాకరిస్తే ఆయనను డైరెక్టర్ నుంచి జిఎం పదవికి రివర్షన్ ఇచ్చారని చెప్పారు.
ఢిల్లీ కిషన్ రెడ్డి గల్లీకి వచ్చి మీటింగ్ పెడుతున్నారు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లి సమీక్ష చేస్తున్నారని తమకు సమాచారం ఉందని, రెండేళ్లు బొగ్గు మంత్రిగా ఉన్నా కూడా ఆయన ఇప్పటివరకు పట్టించుకోలేదని అన్నారు. బిఆర్‌ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో అత్యవసర సమావేశం జరిగిందని, ఢిల్లీ కిషన్ రెడ్డి గల్లీకి వచ్చి కొత్తగూడెంలో సింగరేణిపై మీటింగ్ పెడుతున్నారని విమర్శించారు. ఈ కుంభకోణంపై విచారణ కోరుతూ హరీష్‌రావు లేఖ రాశారు. కోల్ స్కాంపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సిట్.. పొట్టు.. లట్టు..దేనికీ భయపడేది లేదు
సిట్.. పొట్టు.. లట్టు..దేనికీ భయపడేది లేదని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవినీతిని బయటపెట్టే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు.ధైర్యం ఉంటే సిట్ విచారణ వీడియో బయటపెట్టాలని హరీష్‌రావు సవాల్ విసిరారు. లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు..? అని ప్రశ్నించారు. రెండేళ్లు దాటినా లీకు రాజకీయాలే నడుపుతారా..? అని ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్ అని సెటైర్లు గుప్పించారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే సిట్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోపల ఏదో జరుగుతోందని తప్పుడు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. లీకులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కట్టుకథలతో ఇంకెన్నాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతారని నిలదీశారు. సిఎంం రేవంత్‌త్‌రెడ్డి ఉడత బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు.