Reading Time: 2 minutes

కేరళలో మార్పు చోటుచేసుకుంటుందని, ప్రజలకు బిజెపిపై నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బిజెపి తరఫున తిరువనంతపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజకీయ మార్పునకు వీలుందని తెలిపారు. తిరువనంతపురంలో నాలుగు దశాబ్దాల వామపక్ష పాలన అంతం అయింది. బిజెపిపై ప్రజలకు ఏర్పడుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనం అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్‌లో నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. గుజరాత్‌లో ఒకే ఒక్క నగరంలో గెలుపు సాధించి , ఆ తరువాత అక్కడ బిజెపి పూర్తిస్థాయిలో అధికారానికి వచ్చింది. తిరుగులేకుండా సాగుతోందని గుర్తు చేశారు. ఇక్కడ కేరళలో కూడా తిరువనంతపురంతో ఆరంభమైన బిజెపి విజయం విస్తరించుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. 1987 ముందటి వరకూ గుజరాత్‌లో బిజెపి నామమాత్రపు పార్టీగా ఉండేది. మీడియా కూడా ఎక్కువగా పట్టించుకోకుండా ఉండేది.

1987లో రాజకీయ మలుపు చోటుచేసుకుంది. అక్కడ తొలిసారిగా రాజధాని అహ్మదాబాద్‌లో బిజెపి ఆధిపత్యం నెలకొంది. అక్కడి నుంచి పార్టీ విజయయాత్ర సాగిందన్నారు. కేరళలో కూడా ఇప్పుడు తిరువనంతపురం గెలుపు మలుపు అవుతుందని చెప్పారు. ఏ మార్పు కోసం అయినా ప్రజల నమ్మకం కీలకం అవుతుంది. అక్కడ అహ్మదాబాద్ ఆరంభం. ఇక్కడ తిరువనంతపురం మైలురాయి అవుతుందని చెప్పారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి సేవలు అందించేందుకు అవకాశం కల్పించారు. దీనిని తాము నిలబెట్టుకుంటున్నామని తిరువనంతపురం సభలో చెప్పారు. ఇక్కడి బిజెపి గెలుపు మామూలు విషయం కాదు. కేరళను ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌ల అవినీతి వలయాల , రంగుల రాట్నాల బారి నుంచి విముక్తం చేయాలనే కృత నిశ్చయానికి తొలి గెలుపు అని విశ్లేషించారు. తిరువనంతపురం ప్రజలను అభినందించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త రైలు సేవల ఆరంభానికి ప్రధాని మోడీ కేరళ పర్యటనకు వచ్చారు.

ప్రజల ప్రేమను డ్రామాగా గేలిచేసే రకాలు..విమర్శకులపై ప్రధాని మోడీ మండిపాటు

జనం ప్రేమాభిమానాలు చూపితే , వాటి వెనుక డ్రామాలు ఉన్నాయని అంటారు. పైగా ప్రచారపు ఎత్తుగడగా దుష్ప్రచారం చేస్తారు. అయితే ఇటువంటి గేలికి తాను అలవాటు పడ్డానని ప్రధాని మోడీ తెలిపారు. శుక్రవారం తిరువనంతపురంలో ఓ చిన్నారి మోడీ చిత్రాన్ని గీసి తనకు కన్పించేలా నిలబడినప్పుడు ప్రధాని స్పందించారు. ఈ బాలుడి వద్ద ఉన్న ఫోటోను తన రక్షణ సిబ్బందికి చెప్పి తెప్పించుకున్నారు. దీని వెనుక పేరు, అడ్రసు రాయమని, తరువాత మాట్లాడుతానని చెప్పారు. తాను ఎక్కడికి అయినా వెళ్లినప్పుడు ప్రజలు తన పట్ల చూసే అభిమానం గురించి ప్రస్తావించారు. ప్రత్యేకించి పిల్లలు, యువత తమ స్పందనను ఈ విధంగా చిత్రాలతో కనబరుస్తారు. వీటిని తాను స్వీకరిస్తాను. అయితే తరువాత దీనిపై కొందరు వెంటనే వ్యంగ్మాత్మక విమర్శలతో రీల్స్ చేస్తారు. మోడీది ప్రచార ఆర్బాటం, పెద్ద నాటకం అని దెప్పిపొడుస్తారు. అయితే ఇటువంటి వాటితో తన తలబొప్పి కొట్టింది. తాను ప్రజల ప్రేమ అభిమానాలను సాదరంగా స్వీకరిస్తానని, వేరే విధంగా స్పందించే వారి వైఖరితో ప్రజల పట్ల ఆదరణను మరింత పెంచుకుంటానని తెలిపారు. జనం మధ్యలో బాబు చాలా సేపు తన పటంతో నిలబడ్డాడని, అలసిపోతూనే ఈ బొమ్మ తనకు కనబడాలని తపించాడని, ఇటువంటివి తరచూ తనకు ఎదురయ్యే ఘటనలు అని తెలిపిన ప్రధాని ఇదే దశలో వెటకారాలకు దిగే వారూ ఉంటారని నవ్వుతూ చెప్పారు.