Reading Time: < 1 minute

షోరూంల వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది. ప్రయోగాత్మకం గా హైదరాబాద్ పరిధిలోని ఓ షోరూంలో దీనిని రవాణా శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. వాహనాల యజమానులు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లకుండా డీలర్ వద్దే వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా రవాణా శాఖ ఈనెల 8వ తేదీన విధాన పర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రవాణా శాఖ అధికారులు సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లో సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత సాఫ్ట్‌వేర్ ఆధారంగా ప్రయోగా త్మకంగా శుక్రవారం శ్రీ కృష్ణ ఆటోమోటివ్స్ షో రూంలో డీలర్ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని విజయవంతంగా అధికారులు నిర్వహించారు. ఈ విధానం విజయవంతం కావడంతో ఇక నుంచి కొత్త వాహనాలు షోరూంల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు. 24-01-2026 నుంచి కొన్న వాహనాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని – రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ఈ కొత్త విధానం ప్రకారం డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుంటారు. అవసరమైన పత్రాలు (ఇన్‌వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫొటోలు మొదలైనవి) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన పత్రాల ఆధారంగా రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. అనంతరం వాహనానికి సంబంధించి ఆర్‌సిని స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపిస్తారు. ఈ విధానం అమలుతో ప్రజలకు సమయం ఆదా అవుతుంది. ఈ విధానం గురించి రవాణా శాఖ కమిషనర్ 33 జిల్లాల రవాణా శాఖ అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఆ విధానం అమల్లో షో రూం డీలర్లకు ఏవైనా సందేహాలుంటే సంబంధిత జిల్లా రవాణా శాఖ అధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని రవాణా శాఖ తెలిపింది.