
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కోపం వచ్చింది. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వికారాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ తరఫున న్యాయవాది సదరు మాజీ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసు పంపించారు.తనను మానసికంగా క్షోభ పెట్టినందుకు పది కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించడంతో పాటుగా వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టం ప్రకారం న్యాయ స్థానాల ద్వారా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.మెతుకు ఆనంద్ ఈ నెల 14న ఇంకా ఈ నెల 19న తేదీలలో మీడియా సమావేశాల్లో నిర్లక్షంగా మాట్లాడుతూ తనపై నిరాధార తప్పుడు, అసత్య, అభూత కల్పనలు, కట్టు కథలతో కూడిన అవినీతి ఆరోపణలు చేశారని, వ్యక్తిగత జీవితానికి, గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో తాను వందల కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆనంద్ ఆరోపించారని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు.
రాజ్యాంగబద్దమైన పదవిని అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వికారాబాద్ పురపాలన సంఘాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారనే కట్టు కథలు అల్లారని ఆయన విమర్శించారు.అంతేకాకుండా తనను బుల్లెట్ రాజు అంటూ అవహేళనగా మాట్లాడి వ్యక్తిగతంగా మనసును గాయపరిచారని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో ఇతరులపై విమర్శలు చేసే స్వేచ్ఛ, స్వాతంత్య్రం రాజ్యాంగం కల్పించిందని, కానీ నిరాధార ఆరోపణలు చేయడం మాత్రం అత్యున్నత పదవులను అవమానించడం, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయడానికి చేసే ప్రయత్నం అవుతుందని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలను సమాజంలో సాకుగా, న్యాయ స్థానాలు కూడా సమర్థించవని, భారత న్యాయ సహితలోని సెక్షన్ ల ప్రకారం దురుద్వేశ ఆరోపణలు చేసిన వారు శిక్షార్హులని ఆయన వివరించారు.అట్టడుగు స్థాయి నుంచి వచ్చి శాసన వ్యవస్థలో అత్యన్నతమైన శాసన సభాపతి హోదాలో ఉంటూ, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయిస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.