
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌పై మరింత కట్టుదిట్టమైన నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరంతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల జారీ చేయనున్నారు.- ఈ పరీక్షలకు సుమారు 4 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. సిసి కెమెరాలు ఉన్న కాలేజీ ల్యాబ్‌లకే ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు సెంటర్లు కేటాయించనున్నారు. కార్పోరేట్, ప్రైవేట్ కాలేజీలు స్వతహాగా సిసి కెమెరాలు అమర్చుకున్నారు.
ప్రభుత్వ కాలేజీలలో అమర్చిన సిసి కెమెరాలతో పాటు ప్రైవేట్ కాలేజీలలో ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయించే ల్యాబ్‌ను కూడా ఇంటర్ బోర్డ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేస్తున్నారు.ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం అయినందున వాటిల్లోనే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే కేంద్రాలలో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణతో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తారు. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు కూడా ప్రాక్టికల్ పరీక్షలను పర్యవేక్షిస్తారు.
పారదర్శకంగా ప్రాక్టికల్ పరీక్షలు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా థీయరీపైనే దృష్టి సారించి, ప్రాక్టికల్స్‌ను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో అవసరమైనా సామాగ్రి లేకపోవడం, మరికొన్నింటిలో నేర్పించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కొన్ని కాలేజీలు ప్రాక్టికల్ పరీక్షలో తమ విద్యార్థులు పూర్తి మార్కులు కేటాయిస్తుందన్న ఆరోపణల నేసథ్యంలో పారదర్శకంగా ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ర్యాంకుల పందేరంలో ప్రాక్టికల్స్ మార్కులే కీలకం. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఎంపిసి వారికి 60 మార్కులు, బైపిసి వారికి 120 మార్కులు ఉన్నాయి. ఒక్క మార్కు తేడాతో కూడా ర్యాంకులు తారుమరవుతుంటాయి. దాంతో ర్యాంకుల పోటీలో ప్రతి మార్కూ కీలకంగానే మారుతుంది.