
ప్రభుత్వ ధాన్యం మళ్లింపును అరికట్టేందుకు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. విజిలెన్స్ టీమ్ 8 బృందాలుగా విడిపోయి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, నల్లగొండ, మహబూ బాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సూర్యాపేట, కామారెడ్డి, నిజామాబాద్ మొత్తం 9 జిల్లాల్లో 19 రైస్ మిల్లులను తనిఖీ చేశారు. అందులో 14 మిల్లుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారించారు. అదేవిధంగా మిగిలిన 5 మిల్లులకు నోటీసులు జారీ చేసి అబ్జ ర్వేషన్‌లో పెట్టారు. కాగా, తనిఖీల్లో భాగంగా మొత్తం సుమారు 1.90 లక్షల క్వింటాళ్ల ధాన్యం, 1.72 లక్షల బస్తాలు మాయమయ్యాయని,
ప్రభుత్వ ఖజానాకు రూ.60 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని విజిలెన్స్ అధికారులు లెక్క తేల్చారు. ఇందులో నారాయణపేటలో రూ.15.91 కోట్లు, కామారెడ్డి, -నిజామాబాద్ జిల్లాల్లో రూ.19.73 కోట్లు, సూర్యాపేటలో రూ.19.32 కోట్లు, పెద్దపల్లిలో రూ.11.38 కోట్ల విలువైన ధాన్యం తక్కువగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని పూసాల గ్రామంలోని జానకీరామ ఇండస్ట్రీస్ మిల్లును ఏకంగా సీజ్ చేశా రు. గతంలో నేరాలకు పాల్పడిన మంథనిలోని మారుతి ఇండస్ట్రీస్‌పై క్రిమినల్ చర్యలు పూర్తి చేశారు. అక్రమాలకు పాల్పడిన మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా వారి లైసెన్సుల రద్దు చేసి బ్లాక్ లిస్టింగ్ పెడతామని, ధాన్యం రికవరీ కోసం పౌర సరఫరాల శాఖకు సిఫార్సు చేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.