
Allahabad High Court: భార్యను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత భర్తదే అని, అతను చనిపోయినా బాధ్యత ముగిసిపోదని అలహాబాద్ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఒక వితంతువు తన మరణించిన భర్త ఆస్తి నుంచి భరణం పొందవచ్చని, ఒక వేళ అది సరిపోకపోతే తన మామగారి నుంచి పొందొచ్చని కోర్టు పేర్కొంది. అకుల్ రస్తోగి అనే వ్యక్తి తన భార్య తప్పుడు సాక్ష్యం చెబుతోందంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అరిందమ్ సిన్హా, జస్టిస్ సత్య వీర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్‌కు కారణం ఇదే..
భర్త తరుపున వాదించిన న్యాయవాది.. భార్య తన ఆర్థిక స్థితిని దాచిపెట్టి భరణం కోరిందని ఆరోపించారు. ఆమె తనను తాను గృహిణిగా చూపించుకుని, తన వద్ద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని తెలిపారు. అయితే, విచారణలో ఈ డిపాజిట్లు మహిళ తండ్రి ద్వారా వచ్చినవని, ప్రస్తుతం దాంట్లో ఎక్కువ భాగం విత్ డ్రా అయినట్లు తెలిసింది. దీంతో ఆమెకు ఆర్థిక సహాయం అవసరమని కోర్టు భావించింది.
ఈ కేసును విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేుసింది. ఆరోపణలకు మద్దతుగా సాక్ష్యాలు అందించడంలో భర్త తరుపు లాయర్ విఫలమైనట్లు న్యాయమూర్తులు భావించారు. భర్త మరణించిన తర్వాత ఆస్తి సరిపోకపోతే వితంతు మహిళ అత్తమామల నుంచి కూడా భరణం కోరేందుకు హక్కు ఉంటుందని చెప్పింది. అయితే కొన్ని చట్టపరమైన పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. భర్త తన భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించింది. భార్యకు భరణం అందించడం భర్త విధి అని కోర్టు పేర్కొంది. భర్త మరణంతో అతడి విధి ముగిసిపోదని, కొన్ని షరతులకు లోబడి అత్తింటి వారి నుంచి భరణం కోరే హక్కు వితంతు స్త్రీకి ఉంటుందని పేర్కొంది.