
Off The Record: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు బెందాళం అశోక్. ప్రస్తుతం కూటమి సర్కార్‌లో ప్రభుత్వ విప్‌గా కీలక పదవిలో ఉన్నారాయన. ఈ సీనియర్ లీడర్‌కు సౌమ్యుడన్న ఇమేజ్ కూడా ఉంది. కానీ… అదంతా ఒకప్పటి మాట. సార్…. ఇప్పుడు బాగా తేడాగా కనిపిస్తున్నారన్నది లేటెస్ట్ టాక్. లోకల్‌గా ఆయన తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. స్థానిక గిరిజనులను ఆయన డీల్ చేసిన విధానం, అన్న మాటలతో బెందాళానికి బ్యాడ్ ఇమేజ్ తీసుకురావడంతో పాటు టీడీపీని కూడా ఇరుకున పడేసిందని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ విప్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆందోళనలు చేసే స్థాయికి వెళ్ళింది వ్యవహారం. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజనులపై మీదికి ఎమ్మెల్యే ఒంటికాలి మీద లేస్తే ఎలాగంటూ సొంత పార్టీ నుంచి కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు నాయకులు. ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని పదేపదే చెప్పుకుంటూ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన బడుగు జీవుల్ని దూషించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ నిలదీస్తున్నారు.
హాఫ్ నాలెడ్డ్ పీపుల్, మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి? బుర్ర ఉండే మాటాడుతున్నారా? లాంటి వాటితో పాటు మరికొన్ని ఇంకాస్త ఘాటైన పదాల్ని కూడా వాడటం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. బెందాళం వ్యాఖ్యలతో మండిపడ్డ గిరిజన సంఘాల జేఏసీ… ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని, అట్రాసిటీ కేసు నమోదు చేయమని డిమాండ్ చేసింది. సీనియర్ ఎమ్మెల్యే అయిన అశోక్ అలా మాట్లాడ్డం ఏంటని సొంత టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. అటు ఆయన మాటలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అశోక్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆందోళనలు సైతం జరుగుతున్నాయి.. మెల్లిగా సెగలు పెరిగిపోతుండటంతో… ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే కష్టమనుకున్న అశోక్… నష్టనివారణ చర్యలు మొదలుపెట్టారట. కానీ…. గిరిజనులకు సారీ చెబుతూనే ఒక వ్యక్తి తనను, తన అధికారాలను ప్రశ్నించే విధంగా మాట్లాడ్డంతోనే అలా అనాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న 27వేల మంది బెంతు ఒరియాల సమస్యపై మాట్లాడుతున్నప్పుడు అందులోని ఓ వ్యక్తి తన అధికారాలను ప్రశ్నించారని, ఆ ఆవేశంలో తాను మాట్లాడినట్టు క్లారిటీ ఇచ్చుకున్నారాయన.
మొత్తం వీడియో చూస్తే అర్ధం అవుతుందని, వైసీపీ వాళ్ళు దాన్ని వదిలేసి…. తమకు కావాల్సిన రీతిలో కట్ అండ్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే మాట. అరగంటకు పైగా ఒక అంశం మీద చర్చ జరిగితే అదంతా పక్కనబెట్టి తనను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తునారు ఎమ్మెల్యే. తాను ఏ వర్గానికి, కులానికి వ్యతిరేకం కాదని, ఒక్క వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే అన్నానంటూ వివరణ ఇచ్చుకున్నారు. తన మాటల్ని వెనక్కు తీసుకుంటున్నానని కూడా చెప్పేశారం అశోక్. కానీ…. ఆయన ఎంత వివరణ ఇచ్చుకున్నా, ఏం చెప్పినా…. అప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు ఏం చెప్పినా అది ప్యాచ్‌వర్కే తప్ప…కవర్ అవదన్న అభిప్రాయం బలపడుతోంది. కానీ…. నలుగురిలో మాట్లాడేటప్పుడు నోటి అదుపు, మాట పొదుపు లేకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికైనా అర్ధం చేసుకుంటే మంచిదంటూ ఇచ్చాపురం తమ్ముళ్లే చురకలంటిస్తున్నారు. గతంలో కూడా ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశించి అశోక్ ఇలాగే నోటి దురద మాటలు మాట్లాడారని, ఇక నుంచైనా వీటిని తగ్గించుకుంటే మంచిదన్న సలహాలు వస్తున్నాయి. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఏ మాత్రం ఉపయోగం ఉండబోదని అంటున్నారు.