Reading Time: 3 minutes

దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు వందేళ్లకు దగ్గర కావస్తున్నది. అయినా ఈ సమాజంలో దళిత, అణగారిన వర్గాల పరిస్థితి, బతుకుల్లో ఆశించినంత ఫలితాలు మాత్రం రాలేవనడానికి అనేక సాక్ష్యాలు నేటికీ కన్పిస్తున్నాయి. స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం తరువాత దళిత జనాభాలో అత్యధిక సంఖ్య గల మాదిగల బతుకుల్లో ఇంకా రావాల్సినంత సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన హక్కులకు ఇంకా అందనంతా దూరంలోనే ఉన్నారు. అంటరానితనం, అసమానతల పేరిట తీవ్రమైన అణచివేతలతో మాదిగ సమాజంలో రావాల్సినంత మార్పు ఇంకా రాకుండా పోయింది. రోజురోజుకు శాస్త్రసాంకేతిక పెరుగుతున్నప్పటికీ అంతే స్థాయిలో వివక్ష పెరుగుతూనే ఉంది. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లో అత్యంత దిగువ ఉన్నది మాదిగలు. అటువంటి మాదిగలను తరతరాలు బతుకుకు, ఉనికికి అధికారానికి, దూరంగానే ఉంచుతున్నారు.

ఆధిపత్య కులాల పెత్తనం కింద మాదిగలు సమాజం నుంచి వెలివేయబడ్డారు. అటువంటి పరిస్థితులను అధిగమించి ఊరి అవతల ఉండి.. సబ్బండ కులాలకు కావాల్సిన ఉత్పత్తులను అందించిన ఘనత మాదిగలకు ఉంది. ముఖ్యంగా తోలు ఉత్పత్తులను తయారు చేసి వస్తుమార్పిడి విధానంతో శ్రమను దారబోసి ఎన్నో ఉత్పత్తులను ఈ సమాజానికి అందించారు మాదిగలు. ఊళ్లో జంతు కళేబరాలను తొలగించి శుద్ధి చేయడంతోపాటు ఆ జంతు చర్మాన్ని ఒలిచి చెప్పులు, వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన చరిత్ర ఉన్నది. వ్యవసాయానికి తొండెం బొక్కెన, నీటి నిల్వకోసం తోలు తిత్తి, వ్యవసాయంలో ప్రధానంగా తోడుగా ఉండే ఎడ్ల కాళ్లకు జోళ్లు లాంటి పరికరాలను తయారు చేసి ఇచ్చిన ఘనత వాస్తవానికి ఓ సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగిన మాదిగలను, వారి ఉత్పత్తులను వాడుకున్నారే తప్ప ఏనాడు మనుషులుగా గుర్తించలేదు.. మాదిగ సమాజం వారి వృత్తి ప్రధానంగా తోలును శుద్ధి చేయడం, పాదరక్షలు, బెల్టులు, సంచులు, కల్లు డబ్బాలు, సంచులను తయారు చేయడంతో ముడిపడి ఉంది. వీటిని అవసరమైనప్పుడు వివిధ కులాల వారికి అందించేవారు. అదనంగా మాదిగ సమాజం డప్పు అనే సాంప్రదాయ డ్రమ్‌ను తయారు చేయడంలో వారి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది.

మాదిగ జనాభాలో గణనీయమైన భాగం సాంప్రదాయకంగా చెప్పులు కుట్టేవారిగా పనిచేశారు. వారు గ్రామ డ్రమ్మర్లు కూడా, వీరు పండుగలు, మరణ, వివాహ వేడుకలు ప్రకటనలలో దండోరా కోసం సృష్టించబడిన డప్పు శబ్దం నేటి సంగీతానికి, వివిధ వాయిద్యాలకు ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం అటువంటి సామాజిక పరిస్థితులు నేటికీ ఆధునిక కాలంలో కన్పించకుండా బుసలు కొడుతూనే ఉంది. దేశంలో, ఇటు తెలుగు రాష్ట్రాలలో చమార్లు, మాదిగల జనాభా అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ దేశంలో ఇంకా బాధితులుగానే ఈ సమాజం ఉంటుంది. తమ ఓటు తాము వేసుకుంటే రాజకీయ అధికారాన్ని శాసించే సత్తా ఉన్నా.. ఆ దిశగా ఏకం కాలేకపోతున్నారు. అటువంటి ఆకాంక్షను కాన్షీరాం తొలిసారి దళిత, బడుగు వర్గాలకు రాజ్యాధికార రుచి చూపగలిగారు. మన ఓటు మనకే అనే నినాదం రాజ్యాధికారానికి సాక్ష్యంగా నిలిచింది.

అయినప్పటికీ ఏకం కాలేకపోతున్నారు. బీహార్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన బాబు జగ్జీవన్ రామ్ తనకు ఎదురైన వివక్షలను జయిస్తూ.. ఉప ప్రధానిగా ఎదగగలిగారు. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పని చేసి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ గతిని మార్చాడు. అయినప్పటికీ బాబు జగ్జీవన్‌రామ్‌ను వివక్ష వదలలేదు. ప్రధానమంత్రిగా ఎదిగే సత్తా ఉన్నా కాకుండా నియంత్రించగలిగారు. అయినప్పటికీ ఒకానొక దశలో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్‌తో 14 స్థానాలను గెలిపించి కింగ్ మేకర్‌గా రాజకీయాలను మలుపు తిప్పిన చరిత్ర ఉన్నప్పటికీ .. అంతే వేగంగా దళితుల చైతన్యాన్ని ఆధిపత్య రాజకీయాలు అంతం చేస్తూ వస్తున్నాయనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు ఒక్కసారిగా దళితుల చైతన్యాన్ని వేటకొడవళ్లు, గొడ్డళ్లతో నరికి చంపిన చరిత్ర ఉంటే… నేడు రాజకీయంగా విచ్ఛిన్నం చేస్తూ రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎదుగుదల లేకుండా అడ్డుకోగలుగుతున్నారు.

నాటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి తెలంగాణ ఏర్పాటు వరకు దళిత, మాదిగ వర్గాలు ఎన్నో అవమానాలు, అణచివేతలు ఎదుర్కొన్నాయి. సామాజిక సమానత్వం కోసం మాదిగల రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలు మించి పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు మాదిగల న్యాయమైన ఆకాంక్షను గుర్తించి ఎస్‌సి వర్గీకరణ చట్టం అమలుకు నోచుకుంది. ఇంతటితోనే మాదిగల బతుకుల్లో పూర్తి స్థాయిలో ఆశించినంత ఫలితాలు మాత్రం రావు. తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే సత్తా ఉన్న మాదిగలకు ఇప్పుడు వాటా కావాలి. రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఉపాధి రంగాలలో అవకాశాలు లభించాలి. తెలంగాణ రాజకీయాలలో మాదిగల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా మారకుండా తరతరాల మాదిగల బతుకుల్లో మార్పు అసాధ్యం. ఇప్పుడు మాదిగ సమాజానికి హక్కులు అడిగే బలమైన రాజకీయ శక్తి అవసరం ఉంది. ఆ శక్తిని చాటితే తప్పా మాదిగలకు రాజకీయ రంగంలో ప్రాధాన్యత దక్కదు. రాజకీయ రంగంలో ప్రాధాన్యత దొరకనంత కాలం శాసించే శక్తిగా ఉన్న మాదిగ సమాజం యాచించే స్థితిలోనే ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మాదిగల జనాభా ఆనాడే 50 లక్షలకు చేరింది. ఇప్పుడు పెరిగిన జనాభాను తీసుకుంటే తెలంగాణ జనాభాలో సుమారు 70 లక్షల జనాభా మాదిగలు ఉంటారు. ఇంత జనాభా ఉండి అచేతనంగా ఉన్న ఈ వర్గానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులకోసం సరికొత్త శక్తి ఏర్పాటు అవుతోంది. అదే మాదిగ మహా శక్తి.

30 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, అనేక సామాజిక కార్యక్రమాల్లో నిలబడిన మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింలు నేతృత్వంలో హక్కుల సాధన దిశగా మాదిగ మహాశక్తి పురుడుబోసుకుంది. ఇప్పటికే మాదిగ మేధావి, ఉద్యోగ, వివిధ రంగాల వారితో నిత్యం మేధో మథనం తరువాత ఇప్పుడు ఓ రాజకీయ, హక్కుల పోరాటానికి తోవ పరిచాడు. మాదిగలను చైతన్యం చేస్తూనే కలిసివచ్చే బడుగు, బలహీన వర్గాలతో రేపటి రోజుల్లో తెలంగాణలో మాదిగ మహాశక్తి తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన జెండా రూపకల్పన, విధివిధానాలు వంటివి సిద్ధం చేసి ఏప్రిల్ 5న జెండా ఆవిష్కరణ జరగనుంది. ఇది ఒక్క మాదిగ సమాజానికి మాత్రమే పరిమితం కాదు, మాదిగలను ఏకతాటిపైకి తెస్తూ కలిసివచ్చే మిగతా బహుజన వర్గాలను కలుపుకొని రాజకీయశక్తిగా నిలవనుంది. స్వల్ప జనాభా కలిగినవారు నాయకులుగా అధికారాన్ని చెలాయిస్తున్న తరుణంలో.. శాసించే సత్తా కలిగే జనాభా కలిగిన మాదిగలు మరో అస్తిత్వ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మన ఓటును మన వారికే వేసి రాజకీయ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఓ గొప్ప సంకల్పంతో ముందుకువస్తున్న మోత్కుపల్లి నర్సింలు వెంట మాదిగ సమాజం ప్రవాహంలా ప్రయాణించాలి.. మాదిగల అభివృద్ధి ధ్యేయంగా.. మానవతా వాదమే లక్ష్యంగా బలమైన సంకల్పానికి మనమంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం

78933 03516