Reading Time: < 1 minute

తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఈ జిల్లాల వాళ్లు అలర్ట్

Caption of Image.

 తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎండలు, వర్షాలతో కూడిన భిన్నమైన వాతావరణం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరో కొన్ని గంటల్లో హైదరాబాద్ లో వర్షం అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం, బి.ఎన్.రెడ్డి నగర్, మీర్‌పేట్, బాలాపూర్, చంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఉప్పల్,నాగోల్ ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మార్చి 31న ఉదయం నుంచే కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజాంబాద్, కరీంనగర్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పగటిపూట కూడా చీకట్లు అలుముకున్నాయి.

రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగనుంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోయినా గాలిలో తేమ పెరగనుంది. 

అయితే ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీరు మిగిలిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న మామిడి పంట ఈదురు గాలుల వల్ల నేలపాలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు చోట్ల మామిడి తోటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.