భద్రాచలం తర్వాత అంతటి ప్రాముఖ్యాన్ని పొందిన దేవాలయం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం అలాంటి దేవాలయం ఒకానొక సమయంలో శిథిలావస్థకు చేరుకొని పూజా కార్యక్రమాలు జరగకుండా ఉన్న క్రమంలో స్థానికంగా ఉన్న కొందరు ఈయనను సంప్రదించడంతో, తన వద్ద ఉన్న సొమ్ముతో కొంత దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారంట. అవి సరిపోకపోతే కొబ్బరి చిప్పతో భిక్షాటన చేసి దేవాలయం పున: నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు సుబ్బారావు.
అయితే ఆయన ఆ తరువాత 24 వేల శ్లోకాలను 24 వేల పద్యముల విశేష అర్థాలను రచించి ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారికి అంకితం ఇచ్చారు అంట. అక్కన్న మాదన్నల వంశికుడు ఈయన. అంతటి మహోన్నత వ్యక్తి 1920 నుంచి 1922 వరకు కడప చుట్టుపక్కల ప్రాంతాలలో టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి దేవాలయాన్ని పునరుద్ధరించారు.
అంతే కాకుండా ఇంగ్లాండ్ నుంచి ఐరన్ సపోర్టులను తెప్పించి శిథిలావస్థలో ఉన్న గాలి గోపురం వరకు శాశ్వతంగా ఉండే విధంగా ఏర్పాట్లను చేశారు. ఆ రోజుల్లోనే సుమారు మూడు లక్షల ఖర్చు చేసి ఈ నిర్మాణాలను చేపట్టారు అయితే ప్రస్తుతం ఆ టెంకాయ చిప్పను గుంటూరులోని తెనాలిలో ఉన్న అంగలకుదురు గ్రామంలోని శ్రీ వాస దాస స్వామి పీఠంలో దీనిని భద్రపరిచారు.
ఆంధ్ర వాల్మీకిగా వావిలకొలను సుబ్బారావుకు బిరుదు కూడా ఉంది. ప్రతి ఏటా శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో కళ్యాణం జరిగే సమయంలో ఈ పీఠం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే వారంట అయితే ప్రస్తుతం ఆయనను ఇక్కడ మరిచారు.
ఇదే అంశంపై ఆయన వంశీకులను అడగగా ప్రస్తుతం వావిల కొలను సుబ్బారావు గారు చేసిన త్యాగానికి ఇక్కడ ఫలితం లేదని కనీసం ఆయనను ఇక్కడ తలుచుకోవడం కూడా లేదని ఆయన వంశీకులు అంటున్నారు. 1920 వ సంవత్సరంలో ఇబ్బందుల్లో ఉన్న దేవాలయాన్ని పునర్నిర్మాణంలో కీలకపాత్ర వహించిన వ్యక్తిని మరిచారని ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించి వావిల కొలను సుబ్బారావు గారిని గుర్తించాలని వారు అంటున్నారు.




