
- అమెరికాకు మద్దతిచ్చేందుకు నాటో నిరాకరించిన తర్వాత స్టార్మర్ కీలక వ్యాఖ్యలు
- హార్ముజ్ ను తెరిపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలకు అన్వేషణ
- 35దేశాలతో యూకే దౌత్య సదస్సు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ యుద్ధంలో పాల్గొనబోమని యూకే ప్రధాని సర్ కీర్ స్టార్మర్ తేల్చి చెప్పారు. ఇరాన్ మూసివేసిన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ప్రపంచ దేశాలతో సదస్సును నిర్వహించనున్నట్లు స్టార్మర్ ప్రకటించారు.
ఇరాన్ యుద్ధంలోకి బ్రిటన్ పాల్గొనబోదని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ బుధవారం(ఏప్రిల్ 1) అన్నారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఈ వారం యూకే అంతర్జాతీయ దౌత్య సదస్సును నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కీలక చమురు రవాణా మార్గంలో భద్రతను పునరుద్ధరించేందుకు కలిసి పనిచేస్తామని 35 దేశాలు కలిసి వచ్చాయన్నారు స్టార్మర్. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు సైనిక శక్తి ,దౌత్య కార్యకలాపాల ఐక్య కూటమి అవసరమని స్టార్మర్ స్పష్టం చేశారు.
యుద్ధంలో అమెరికాకు మద్దతిచ్చేందుకు నాటో నిరాకరించినతర్వాత ఆ కూటమి నుంచి వైదొలగడాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత స్టార్మర్ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్దంలో తమ సైనిక స్థావరాలను అమెరికా ఉపయోగించుకోవడానికి నాటో మిత్రదేశాలైన ఇటలీ, స్పెయిన్‌లు నిరాకరించిన తర్వాత స్టార్మర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు కూడా స్టార్మర్ ను ఉద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై యూకేకు సాయం చేయం.. మీరే హార్ముజ్ ను తెరిపించుకొని చమురు తెచ్చుకోండి అని తాను చేతులెత్తేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. దీనిపై స్పందించిన స్టార్మర్.. రక్షణ, భద్రత, ఇంధనం, ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే యూరప్‌తో మరింత బలమైన సంబంధం అవసరం అని అన్నారు.