Reading Time: 2 minutes

పని లేకుండా జీతం తీసుకోవడం కూడా అవినీతే: పోస్టింగ్ ఇవ్వలేదని ఐఏఎస్ పదవికి రాజీనామా..

Caption of Image.

యూపీకి చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రింకు సింగ్ రాహి తన పదవికి రాజీనామా చేశారు. తనకు సరైన పని అప్పగించకుండా, కేవలం జీతం ఇస్తూ అటాచ్డ్ పోస్టింగ్ తో ఖాళీగా కూర్చోబెట్టడం నచ్చక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామాకు  కారణం
రింకు సింగ్ రాహి తన రాజీనామా లేఖలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పనీ చేయకుండా ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవడం కూడా ఒక రకమైన అవినీతే. నా నిజాయితీ విలువలు దీనిని అంగీకరించడం లేదు అని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థలో నిజాయితీగా ఉండేవారికి పనులు ఇవ్వకుండా కేవలం ‘అటాచ్డ్’ పోస్టుల్లో ఉంచి మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 సిట్-అప్స్ ఘటన
గత ఏడాది జూలైలో షాజహాన్‌పూర్‌లో జరిగిన ఒక సంఘటన రింకు సింగ్ రాహి కెరీర్‌ను మలుపు తిప్పింది.  రింకు సింగ్ ఎస్‌డీఎంగా బాధ్యతలు తీసుకున్న 36 గంటల్లోనే ఒక తనిఖీకి వెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేయడాన్ని చూసి, అతనితో అక్కడికక్కడే సిట్-అప్స్ (గుంజీలు) తీయించారు.

 దీనిపై న్యాయవాదులు మండిపడ్డారు. అక్కడ సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేదని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని గొడవకు దిగారు. ఆ సమస్యకు తహసీల్ అధికారిగా తానే బాధ్యత వహిస్తానని చెబుతూ, రింకు సింగ్ అందరి ముందూ చెవులు పట్టుకుని ఐదు గుంజీలు తీశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం ఆయనను ఎస్‌డీఎం పదవి నుండి తొలగించి, లక్నోలోని రెవెన్యూ బోర్డుకు బదిలీ చేసింది. అప్పటి నుండి ఆయనకు ఎలాంటి కీలక బాధ్యతలు ఇవ్వలేదు.

 రింకు సింగ్  స్ఫూర్తిదాయకం
2008లో ఆయన జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిగా ఉన్నప్పుడు స్కాలర్‌షిప్, పెన్షన్ పథకాల్లో జరుగుతున్న భారీ అవినీతిని బయటపెట్టారు. ఆ అవినీతిపరులు ఆయనపై 2009లో హత్యాయత్నం చేశారు. ఏడు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి. దీనివల్ల ఆయన ఒక కంటి చూపు కోల్పోయారు, ముఖం కూడా మారిపోయింది.

 అంతటి కష్టంలోనూ ఆయన వెనకడుగు వేయలేదు. 2021లో దివ్యాంగుల కోటాలో యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించారు. అవినీతిపై పోరాడి బుల్లెట్లు తగిలినా వెనక్కి తగ్గని ఈ అధికారి, చివరకు వ్యవస్థలో తనకు పని చేసే అవకాశం ఇవ్వడం లేదని ఆవేదనతో తన అత్యున్నత ఐఏఎస్ పదవిని వదులుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.