
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. విద్యార్థుల డేటా సవరణకు గతంలో ఇచ్చిన గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ.శ్రీహరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోతరగతి పాస్ సర్టిఫికెట్లలో విద్యార్థుల పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదనే ఉద్దేశంతో గడువు పెంచినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల హెచ్ఎంలు, మేనేజ్మెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల పర్టిక్యులర్స్‌ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, ఏవైనా తేడాలుంటే వెంటనే సరిచేయాలన్నారు. ఈ నెల 9 తర్వాత వచ్చే ఎలాంటి వినతులను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొన్నారు.