నటి మీనా తన కెరీర్, వ్యక్తిగత విషయాలపై ఆసక్తికరమైన అంశాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను కేవలం 8వ తరగతి వరకే చదువుకున్నానని ఆమె వెల్లడించారు. మీనా తన కెరీర్లో చేసిన పాత్రల గురించి మాట్లాడుతూ, అవి ఎక్కువగా “గ్లిజరిన్ క్యారెక్టర్స్” అని, “పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్” పాత్రలని అంగీకరించారు.
సావిత్రిగారి నుంచి శ్రీదేవిగారి వరకు అందరి సినిమాలు చూసి, వారందరి నుంచి కొంత స్ఫూర్తిని పొందినా, ఎప్పుడూ ఎవరినీ అనుకరించడానికి ప్రయత్నించలేదని, తనదైన శైలిని ఏర్పరచుకున్నానని మీనా తెలిపారు. ఇతరులు చేసినవి బాగున్నాయని అనిపించినా, వాటిని తనదైన శైలిలో ప్రదర్శించేదానినని ఆమె చెప్పారు.
హిందీ చిత్రసీమలో కొనసాగకపోవడంపై మీనా వివరణ ఇచ్చారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని, ఒకేసారి రెండు, మూడు షిఫ్టుల్లో పనిచేయడం వల్ల నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదని పేర్కొన్నారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నప్పుడు, వాటిని వదులుకొని బాలీవుడ్‌కు వెళ్లడం సరికాదని తాను భావించానని చెప్పారు.
బాలీవుడ్లో సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని, ఇక్కడి చిత్ర పరిశ్రమకు ఉన్నంత క్రమశిక్షణ అక్కడ ఉండదని తాను విన్నానని మీనా అన్నారు. “ఒక సినిమాలో చేయడం, ఇక్కడ నాలుగు సినిమాలు చేయడం” ఒకటే అవుతుందని అప్పట్లో తనకు చెప్పారని మీనా గుర్తు చేసుకున్నారు.
హేమమాలిని, వైజయంతిమాల, పద్మిని, రేఖ వంటి పలువురు నటీమణులు దక్షిణ భారత దేశం నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించినా, మీనా ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నకు, వారంతా చాలా సినిమాలు వదులుకొనే అక్కడికి వెళ్లారని, కానీ తనకు ఇక్కడ మంచి ఆఫర్లు వస్తున్నాయని, వాటిని వదులుకోవడం ఇష్టం లేదని సమాధానమిచ్చారు.




