
Sourav Ganguly Biopic: క్రికెట్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ ఎట్టకేలకు సెట్స్‌పైకి ఎక్కింది. ఈ మూవీకి సంబంధించిన పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ బయోపిక్ గురించి అనేక వార్త కథనాలు వినిపించినప్పటికీ, తాజాగా షూటింగ్ ప్రారంభం కావడం విశేషంగా మారింది. ఈ సినిమాకు “దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ రావు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఇది ఆరంభం.. ది వన్ అండ్ ఓన్లీ #దాదా” అంటూ అతడు పోస్ట్ చేశారు.
ఈ చిత్రాన్ని లవ్ రంజన్ నిర్మిస్తుండగా, విక్రమాదిత్య మోత్వానే డైరెక్టర్ గా వహిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమైంది. ఇక ఇటీవల ఫిబ్రవరిలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌కుమార్ రావు లుక్ అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఆయన బరువు పెరగడం, హెయిర్‌స్టైల్ లో మార్పులు చూసి ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆ తర్వాత స్పందించిన రాజ్‌కుమార్, గంగూలీ పాత్ర కోసం తన శరీర ఆకృతిని ప్రత్యేకంగా మార్చుకున్నానట్లు తెలియజేశాడు.
కాగా ఈ మూవీలోని పాత్ర కోసం రాజ్ కుమార్ రావు సుమారు 9 నుంచి 10 కిలోల వరకు బరువు పెరిగారు. పిజ్జా, స్వీట్స్, ఆలూ పరాఠా, బిర్యానీ లాంటి ఇష్టమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. గ్లామర్‌ను పక్కన పెట్టి పాత్రకు తగ్గట్టుగా తనను తాను పూర్తిగా మార్చుకున్నానట్లు వెల్లడించారు.ప్రస్తుతం మళ్లీ బరువు తగ్గుతూ గంగూలీ లుక్‌కు సరిపోయే విధంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.