Reading Time: < 1 minute

మార్నింగ్ కోర్టులకు ప్రత్యేక మేజిస్ట్రేట్ పోస్టు… ఏప్రిల్ 17 లోపు దరఖాస్తులకు అవకాశం

Caption of Image.

మల్కాజిగిరి, వెలుగు: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జడ్జి యూనిట్ పరిధిలో మార్నింగ్ కోర్టులకు అధ్యక్షత వహించేందుకు ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్/రెండవ తరగతి ప్రత్యేక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి తెలిపారు. 

ఎంపికైన అభ్యర్థి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకు కోర్టులు నిర్వహించాల్సి ఉంటుంది. వారికి నెలకు రూ.45 వేల గౌరవ వేతనం, రూ.5 వేల ప్రయాణ భత్యం చెల్లిస్తారు. పదవీకాలం ఒక సంవత్సరం. నోటిఫికేషన్, దరఖాస్తు ఫారమ్‌‌‌‌ను జిల్లా కోర్టుల వెబ్‌‌‌‌సైట్ districts.ecourts.gov.in/medchal నుంచి డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన పత్రాలతో రెండు ప్రతులుగా ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటలలోపు కూషాయిగూడలోని ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.

అర్హుతలు ఇవీ..

ఏపీ లేదా తెలంగాణ ఉన్నత న్యాయ సేవల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు, లేదా రాజీనామా చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జ్యుడిషియల్ మినిస్టీరియల్ సర్వీసులో హెడ్ క్లర్క్/జిల్లా మున్సిఫ్ కోర్టు సూపరింటెండెంట్ స్థాయి లేదా అంతకంటే పై హోదాలో పనిచేసి లా డిగ్రీ కలిగినవారు అర్హులు. 

హైకోర్టు సేవల్లో సెక్షన్ ఆఫీసర్ లేదా అంతకంటే పై స్థాయిలో పనిచేసి లా డిగ్రీ ఉన్నవారు, ఐదేళ్లకు పైగా న్యాయవాదిగా పనిచేసి ప్రస్తుతం ప్రాక్టీస్ చేయని 45 ఏళ్లు దాటిన అడ్వకేట్లు, కనీసం మూడేళ్లు మేజిస్టీరియల్ అధికారాలు వినియోగించిన రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు కూడా దరఖాస్తు చేయవచ్చు. పదవీ విరమణ చేసిన న్యాయాధికారులకు ప్రాధాన్యం ఉంటుంది.
 

©️ VIL Media Pvt Ltd.