
మిడిల్ ఈస్ట్‌లో అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన కొన్న గంటల్లోనే ఇరాన్ అనుకున్నంత పని చేసింది. బహ్రెయిన్‌లోని బటెల్కో (Batelco) ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. బహ్రెయిన్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్వహిస్తున్న అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ లో బటెల్కో ఒకటి కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ క్షిపణి దాడుల వల్ల బహ్రెయిన్‌లోని కీలకమైన టెలికమ్యూనికేషన్ హబ్‌లో మంటలు చెలరేగి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతం నుంచి దట్టమైన పొగలు కమ్ముకుంటున్న దృశ్యాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బటెల్కో బహ్రెయిన్ జాతీయ మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైన భాగం. ఈ టెలికాం హబ్‌పై జరిగిన దాడి దేశ భద్రత పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ వివాదంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో ఈ దాడి జరిగింది. పశ్చిమాసియాలో అమెరికాతో సంబంధం ఉన్న టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ఇటీవల పదేపదే హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్దంలో భాగంగా ఇప్పటికే బహ్రెయిన్, సౌదీ అరేబియా ,యూఏఈ తో సహా పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
ALSO READ : ఒరాకిల్ సడెన్‌గా 30వేల మంది టెక్కీలను ఎందుకు తీసేసింది..
దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ.. బహ్రెయిన్ అధికారులు, బటెల్కో యాజమాన్యం గానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) నుంచి గానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారికంగా ప్రకటించలేదు.