
ఇంగ్లండ్ సీనియర్ ఆల్ రౌండర్ రవి బొపారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్‌కు బొపారా వీడ్కోలు పలికాడు. 2026 ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్‌కు ముందే తన నిర్ణయాన్ని బొపారా బయటపెట్టాడు. 40 ఏళ్ల బొపారా గత కొంతకాలంగా ఇంగ్లండ్ టి-20 బ్లాస్ట్, వన్డే కప్‌లలో మాత్రమే ఆడుతున్నాడు. 2002లో ఎసెక్స్ తరఫున బొపారా తన కౌంటీ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు 18 సంవత్సరాల పాటు ఆ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. 2020లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కానీ, మూడేళ్ల తర్వాత మళ్లీ నార్తాంప్టన్‌షైర్ జట్టులో బొపారా చేరాడు. గత రెండు సీజన్లుగా ఆ జట్టు తరఫున అతడు ఆడాడు. గత సీజన్‌లో నార్తంప్టన్‌షైర్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో బొపారా కీలక పాత్ర పోషించాడు. సర్రేతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 46 బంతుల్లోనే 105 పరుగులు చేసి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈసారి కూడా అతడికి కౌంటీ ఆడేందుకు ఆఫర్స్ వచ్చినప్పటికీ.. వాటిని సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.
బొపారా ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు, 120 వన్డేలు, 38 టి-20లు ఆడాడు. మూడు ఇన్నింగ్స్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా అతడు అరుదైన రికార్డు సాధించాడు. కాగా, ఇంగ్లండ్ తరఫున 2015లో అతడు చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి కేవలం డొమాస్టిక్ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ (2009. 2010), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015) జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
ప్రస్తుతం కరాచీ కింగ్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా అతడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. త్వరలో కౌంటీ క్రికెట్‌లో కామెంటేటర్‌గా అతడు కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ జట్టు జాతీయ సెలెక్టర్‌గా కావాలని బొపారా ఆశిస్తున్నాడు.