Reading Time: < 1 minute

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల మహోన్నత త్యాగాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు.

‘తరతరాలు గుర్తుంచుకునేలా, అపారమైన విశ్వాసంతో 33,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు నా ప్రగాఢ గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను‘ అని పేర్కొన్నారు. అదే సమయంలో, అమరావతికి బలమైన పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు. ఈ బృహత్ కార్యం వాస్తవరూపం దాల్చడానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.