Reading Time: 2 minutes

‘నమ్మేయాలి డ్యూడ్’.. శర్వానంద్ కోసం బైక్ ఎక్కిన ప్రభాస్!

Caption of Image.

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు శర్వానంద్‌. ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, మునుపెన్నడూ లేని సరికొత్త పాయింట్‌తో వస్తున్న చిత్రం ‘బైకర్‌’ (Biker). మోటోక్రాస్‌ రేసింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు రెబల్ స్టార్ ప్రభాస్ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

ప్రభాస్‌ ‘మిర్చి’ స్టైల్ ప్రమోషన్!

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన లేటెస్ట్ వీడియో ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. తన ఆప్తమిత్రుడు శర్వానంద్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగారు. ‘మిర్చి’ సినిమాలో తన ఫేమస్ డైలాగ్‌ను రీక్రియేట్ చేస్తూ.. ‘ట్రైలర్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌’ అంటూ ప్రభాస్ చెప్పిన తీరు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. సినిమా థీమ్‌కు తగ్గట్టుగా ప్రభాస్ ఒక స్టైలిష్ బైక్‌పై కూర్చుని సినిమాను ప్రమోట్ చేసిన విధానం ‘బైకర్‌’  మూవీపై మరింత అంచనాలను పెంచేసింది. యూవీ క్రియేషన్స్‌తో ప్రభాస్‌కు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే, అందుకే ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

సరికొత్త కథాంశం.. 

భారతీయ వెండితెరపై క్రికెట్, కబడ్డీ వంటి క్రీడల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ప్రొఫెషనల్ మోటోక్రాస్‌ రేసింగ్ (Off-road racing) నేపథ్యంలో వస్తున్న మొదటి పూర్తిస్థాయి చిత్రం ఇదే. రేసింగ్ ట్రాక్స్‌పై బైకర్లు చేసే విన్యాసాలు, మలుపుల వద్ద ఎదురయ్యే ప్రాణాపాయ స్థితి, గెలుపు కోసం వారు పడే తపనను దర్శకుడు అభిలాష్ రెడ్డి అత్యంత సహజంగా ఆవిష్కరించారు.

పవర్ ప్యాక్డ్ కాంబినేషన్

ఈ సినిమాలో శర్వానంద్ ఒక ప్రొఫెషనల్ రేసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన విదేశాల్లో ప్రత్యేకంగా రేసింగ్ శిక్షణ తీసుకోవడం విశేషం. ఇక ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ సీనియర్ నటుడు, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్. ఆయన ఈ సినిమాలో ఒక కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. శర్వానంద్, రాజశేఖర్ మధ్య వచ్చే ఎమోషనల్, కాన్‌ఫ్లిక్ట్ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. కథానాయికగా మాళవిక నాయర్ తనదైన నటనతో మెప్పించనుంది.

 విడుదల ఎప్పుడంటే.?

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాణం కావడంతో విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. రేసింగ్ సీక్వెన్స్‌ల కోసం గోప్రో కెమెరాలు, అత్యాధునిక డ్రోన్ షాట్స్‌ను ఉపయోగించారు. సౌండ్ డిజైన్ ప్రేక్షకులకు థియేటర్లో ఒక రేస్ ట్రాక్ మీద ఉన్నామనే అనుభూతిని కలిగిస్తుంది. వేగం, సాహసం, భావోద్వేగం కలగలిసిన ఈ ‘బైకర్’ ప్రయాణం ఏప్రిల్ 3న బాక్సాఫీస్ రేసును ప్రారంభించనుంది. సమ్మర్ సీజన్‌కు శర్వానంద్ అందిస్తున్న ఈ పర్ఫెక్ట్ యాక్షన్ ట్రీట్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.