పీతల వేుపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు : పీతలు, నూనె, జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రుచికి సరిపడ ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు.
తయారీ విధానం : ముందుగా, నాలుగు మధ్యస్థ పరిమాణంలో ఉండే పీతలను ఎంచుకోవాలి. పీతలను శుభ్రంగా కడిగి, కాళ్లను, పళ్ళను తొలగించి సిద్ధం చేసుకోవాలి. పెద్ద పీతల విషయంలో మధ్య భాగాన్ని రెండుగా కట్ చేసుకోవాలి. పీతలలోని చిన్న కాళ్లను తీసివేయాలి, ఎందుకంటే అవి మసాలాను ఎక్కువగా పీల్చుకుని వృథా చేస్తాయి. పెద్ద కాళ్లను మేధ్యకు కట్ చేసుకుంటే మసాలా లోపలికి బాగా పడుతుంది.
ఇప్పుడు పీతల వేపుడు తయారు చేయడానికి ముందుగా, స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత అర టీస్పూన్ జీలకర్ర సన్నగా పొడుగ్గా తరిగిన నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత, రెండు మీడియం సైజు ఉల్లిపాయలను గుజ్జుగా చేసుకుని పాన్‌లో వేయాలి. ఉల్లిపాయ గుజ్జును రెండు నిమిషాల పాటు దోరగా, మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇవి బంగారు రంగు వచ్చే వరకు కలుపుకోవాలి.
ఇప్పుడు టమాటా ప్యూరీ అందులో వేసి మరో రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అన్నీ వేసుకొని కలుపుకోవాలి. దీని తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని, ఐదు నిమిషాల తర్వాత శుభ్రం చేసుకున్న పీతలను వేయాలి. వీటికి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి.
పీతలకు మసాలా బాగా పట్టి, అవి బాగా ఉడికిన తర్వాత, మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత, పీతలలోంచి నీరు ఊరి ఉంటుంది. దీనిని మరోసారి బాగా కలుపుకుని తిరిగి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు లో హీట్‌లోనే ఉడికించాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పీతల వేపుడు రెడీ.




