
హైదరాబాద్ సిటీలో భారీ ఆహార కల్తీ దందా బట్టబయలైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాంసం మాఫియా గుట్టును ఏప్రిల్ 1న పోలీసులు రట్టు చేశారు. మంగళ్‌హాట్ కేంద్రంగా సాగుతున్నఈ దందాను గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, GHMC టీం సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. అక్కడ చూసిన దృశ్యాలకు షాక్‌కు గురయ్యారు.
రెండు భారీ గోదాముల్లో నిల్వ ఉంచిన సుమారు 10 టన్నుల కుళ్ళిపోయిన మేక , గొర్రె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక ఉన్న సూత్రధారి అఫ్రోజ్.. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర , ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలను, గొర్రెలను తక్కువ ధరకు తెప్పిస్తున్నట్లు విచారణలో తేలింది.
కనీసం స్టోరేజ్ లైసెన్స్ కూడా లేకుండా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ మాంసాన్ని నిల్వ చేస్తూ.. రసాయనాలతో తాజాగా మార్చి నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కీలక నిందితుడు అఫ్రోజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ చరిత్రలోనే ఇది అతిపెద్ద జాయింట్ ఆపరేషన్‌గా నిలిచింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాంసం కొనేముందు వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.