
ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలంలోని మూసాపేట్ లో అక్రమార్కుల నుంచి విలువైన పార్కు స్థలాన్ని కాపాడింది. వివరాల్లోకి వెళ్తే.. 1983లోనే సుమారు 7.12 ఎకరాల్లో హుడా అనుమతితో అక్షయ ఎన్‌క్లేవ్ లేఅవుట్ ఏర్పాటైంది. అయితే ఇందులో కేటాయించిన 968 గజాల పార్కు స్థలంపై కన్నేసిన అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ గోపాల్ అనే వ్యక్తి.. తప్పుడు పత్రాలతో దాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. 2019లో అధికారులను తప్పుదోవ పట్టించి నిర్మాణ అనుమతులు కూడా పొందాడు.
నిజానికి ఆ స్థలం చుట్టూ గతంలోనే జీహెచ్ఎంసీ ప్రహరీ గోడ, గేటు ఏర్పాటు చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలకు వెనకాడలేదు. దీనిపై స్థానిక నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది.
ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న హైడ్రా అధికారులు.. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఆ 968 గజాల స్థలం పార్కుదేనని నిర్ధారించారు. వెనుకాముందు చూడకుండా రంగంలోకి దిగిన హైడ్రా బృందం అక్కడ అక్రమంగా వేసిన నిర్మాణ సామగ్రిని తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆ స్థలాన్ని పార్కుగా గుర్తిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.
తమ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి కోట్లాది రూపాయల విలువైన పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారులకు అక్షయ ఎన్‌క్లేవ్ వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హైడ్రా మరోసారి హెచ్చరించింది.