Reading Time: 2 minutes

ఐదేండ్ల చిన్నారిని అశ్లీలంగా చిత్రీకరించిన నిందితుడు అరెస్ట్

Caption of Image.
  • అమెరికా నుంచి అలర్ట్‌‌ చేసి పట్టించిన గూగుల్‌‌
  •     గోల్కొండకు చెందిన ఫహాద్‌‌ను అరెస్ట్‌‌ చేసిన సీఎస్‌‌బీ
  •      చిన్నారి అసభ్యకర ఫొటోలు, వీడియోలు గూగుల్‌‌ డ్రైవ్‌‌లో     స్టోర్‌‌‌‌ చేసుకున్న డిగ్రీ విద్యార్ధి

హైదరాబాద్‌‌, వెలుగు: ‘భయ్యా’ అని పిలిచే ఐదేండ్ల చిన్నారి అశ్లీల వీడియోలు, ఫొటోలను చిత్రీకరించిన డిగ్రీ విద్యార్థిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో మంగళవారం అరెస్ట్ చేసింది. చిన్నారి ఫొటోలు, వీడియోలు తన మొబైల్ ఫోన్‌‌ ద్వారా గూగుల్‌‌ డ్రైవ్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తున్నట్టు గుర్తించింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌కు తరలించింది. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌‌‌‌ శిఖాగోయల్‌‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

గోల్కొండ కుమ్మరివాడికి చెందిన మహ్మద్ ఫహాద్ అలియాస్ ఆదిల్(19) డిగ్రీ సెకండ్‌‌ ఇయర్ చదువుతున్నాడు. తమ సమీప బంధువుల ఐదేండ్ల కూతురును ఆడిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైకి తీసుకెళ్లేవాడు. చిన్నారి డ్రెసెస్ తీసేసి ప్రైవేట్‌‌ పార్ట్స్‌‌ను తన మొబైల్‌‌లో చిత్రీకరించేవాడు. 

ఫొటోలు, వీడియోలతో గూగుల్‌‌కు చిక్కి

చిన్నారి వీడియోలు, ఫొటోలను తన గూగుల్‌‌ డ్రైవ్‌‌లో స్టోర్‌‌‌‌ చేసుకున్నాడు. కాగా, గూగుల్‌‌ డ్రైవ్‌‌తో పాటు సోషల్‌‌మీడియాలో అప్‌‌లోడ్‌‌ చేస్తున్న  చిన్నారుల అశ్లీల దృశ్యాలను గుర్తించేందుకు అమెరికా కేంద్రంగా నేషనల్‌‌ సెంటర్‌‌ ‌‌ఆఫ్‌‌ మిస్సింగ్‌‌ అండ్‌‌ ఎక్స్‌‌ప్లోయిటెడ్‌‌ చిల్డ్రన్‌‌(ఎన్‌‌సీఎమ్‌‌ఈసీ) ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఫహాద్‌‌ తన గూగుల్‌‌ డ్రైవ్‌‌లో భద్రపరిచిన చిన్నారి ఫొటోలు, వీడియోలను గుర్తించింది. 

ఇందుకు సంబంధించిన మొబైల్‌‌ ఇంటర్నెట్‌‌ ప్రొటోకాల్‌‌(ఐపీ) అడ్రెస్‌‌ను ఇండియాలోని నోడల్ ఏజెన్సీ  నేషనల్‌‌ క్రైమ్‌‌ రికార్డ్స్‌‌ బ్యూరో (ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ)కు పంపించింది. ఎన్‌‌సీఆర్‌‌‌‌బీ నుంచి టిప్‌‌లైన్‌‌ టెక్నాలజీ ద్వారా టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌‌కు సమాచారం అందింది.

గోల్కొండలో నిందితుడి ఐపీ అడ్రెస్‌‌

గూగుల్‌‌ అందించిన ఐపీ అడ్రెస్‌‌ ఆధారంగా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ దర్యాప్తు చేసింది. గోల్కొండ కుమ్మరివాడలో ఐపీ అడ్రెస్ గుర్తించింది. డీఎస్పీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక టీమ్‌‌ ఫహాద్‌‌ను అదుపులోకి తీసుకుంది. చిన్నారి అశ్లీల దృశ్యాలతో కూడిన మొబైల్‌‌ ఫోన్‌‌ను సీజ్‌‌ చేసింది. ఐదేండ్ల చిన్నారికి నిందితుడు ఫహాద్‌‌ అత్యంత సమీప బంధువుగా గుర్తించింది. 

చిన్నారి అతడిని ‘భయ్యా’ అని పిలుస్తుండేదని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఫహద్‌‌పై ఐటీ చట్టంలోని సెక్షన్ 67-బి, పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సిటీ సైబర్ క్రైమ్‌‌ పీఎస్‌‌లో కేసు నమోదు చేసి రిమాండ్‌‌కు తరలించినట్టు సీఎస్‌‌బీ డైరెక్టర్‌‌‌‌ శిఖాగోయల్‌‌ వెల్లడించారు. బాధితురాలికి అవసరమైన సహాయం అందజేయడంతో పాటు, ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించామని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.