
- 12 మందికి గాయాలు, మృతులంతా మహిళలే
- క్రౌడ్ కంట్రోల్ చేయకపోవడంతోనే ప్రమాదం
- నలంద జిల్లాలోని శీతలా మాత గుడిలో ఘటన
నలంద: బిహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి గాయాలు కావడంతో వారందరినీ ఆస్పత్రులకు తరలించారు. నలంద జిల్లాలోని శీతలా మాతా ఆలయంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. చనిపోయినవాళ్లంతా మహిళలేనని అధికారులు ప్రకటించారు.
సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!
బిహార్ షరీఫ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శీతలా మాత ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గుడిలో పూజా కార్యక్రమాలు సాఫీగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శనానికి వెళ్తున్న భక్తుల్లో ఉన్నట్టుండి అలజడి మొదలైంది. హఠాత్తుగా అటూఇటూ పరిగెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి చాలామంది సోయితప్పి పడిపోయారు. ఆలయంలోనే 8 మంది ప్రాణాలు కోల్పోగా, 12 మందికి గాయాలయ్యాయి.
ఆ సమయంలో సోయితప్పి పడిపోయిన మహిళకు ఓ వ్యక్తి సీపీఆర్ చేస్తూ, అపస్మారక స్థితిలో ఉన్నవాళ్ల ముఖాలపై మరో మహిళ నీళ్లు చల్లుతూ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. బారికేడ్లు ఉన్నప్పటికీ క్రౌడ్ కంట్రోల్ చేయడంలో సిబ్బంది ఫెయిల్ అయ్యారని భక్తులు ఆరోపించారు. పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ రూ.6 లక్షల పరిహారం ప్రకటించారు.