Reading Time: 2 minutes

ఈ మధ్య కొంతమంది బిజెపికి చెందిన నాయకులు ముస్లింలకు మతపరంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని వ్యాఖ్యానిస్తున్నారు. మొదట ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. భారత రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లను అనుమతించదు. అది నిజం. కానీ అదే రాజ్యాంగం Backward Classes (వెనుకబడిన వర్గాలు) అనే విస్తృత పదాన్ని ఉపయోగించింది. ఈ పదం కులానికి మాత్రమే కాదు, మతానికి కూడా పరిమితం కాదు. ఏ మతంలో అయినా సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు ఉంటే, వారిని బిసిల కింద గుర్తించే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఇంద్రా సహాని తీర్పు స్పష్టమైన దిశా నిర్దేశం మండల్ కమిషన్ అమలు నేపథ్యంలో వచ్చిన ఇంద్రా సహాని (1992) తీర్పులో, సుప్రీంకోర్టు తొమ్మిది మంది రాజ్యాంగ ధర్మాసనం ఒక ముఖ్యమైన అంశాన్ని స్పష్టం చేసింది. -Backward Classes అనేది మతానికి అతీతమైన వర్గీకరణ. అంటే, ముస్లింలలో, క్రైస్తవుల్లో, సిక్కుల్లో, జైనుల్లో కూడా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు ఉంటే, వారిని బిసిల కింద చేర్చవచ్చు. చరిత్ర చెబుతున్న నిజం. ముస్లింలు బిసిలలో ఉండటం కొత్త విషయం కాదు. స్వాతంత్య్రానికి ముందే Depressed Classesలో కొన్ని ముస్లిం వర్గాలు గుర్తింపు పొందాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ కమ్యూనల్ జిఒ లో కూడా దూదేకుల వంటి వర్గాలు బిసిల్లో ఉన్నాయి. మండల్ కమిషన్, అనంతరామన్ కమిషన్లు కూడా ముస్లింలలోని వెనుకబడిన వర్గాలను బిసిలుగా గుర్తించాయి.

మండల్ కమిషన్, బిసి జనాభాను 52%గా గుర్తించింది. అందులో 8.4% ముస్లిం జనాభా ఉంది. 3743 బిసి కులాలో 82 నుంచి 84 ముస్లిం కులాలు కూడా ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వాస్తవం ఏమిటి?ఈ రోజు బిజెపి పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో కూడా ముస్లింలలోని కొన్ని వర్గాలు ఒబిసి జాబితాలోఉన్నాయి. అలాగే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని ముస్లిం వర్గాలను కేంద్ర ఒబిసిలో చేర్చారు. అయితే, తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఎందుకు వేరే మాట? 2007 చట్టం -ఇంకా పెండింగ్‌లో ఉన్న నిజం. 2007లో ఆంధ్రప్రదేశ్‌లో 14 ముస్లిం కులాలను బిసిలుగా చేర్చిన చట్టాన్ని హైకోర్టులో ఏడుగురు సభ్యుల ధర్మాసనం 2010లో రద్దు చేసింది. ఈ విషయం సుప్రీంకోర్టులో అప్పటి నుండి పెండింగ్‌లో ఉంది. సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఆ రిజర్వేషన్లను కొనసాగించమని చెప్పింది. కానీ -12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ అంశంపై తీసుకున్న స్పష్టమైన చర్య ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఇడబ్లుఎస్‌లో ముస్లింలు – మరి ఇది ఏమిటి? బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇడబ్లుఎస్ రిజర్వేషన్లలో కూడా బిసిలుగా గుర్తింపు పొంద లేని ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు, క్రిస్టియన్‌లకు రిజర్వేషన్స్ పొందే అవకాశం బిజెపి ప్రభుత్వం కల్పించింది. మరి ఒకవైపు ఇడబ్లుఎస్‌లో అవకాశం ఇస్తూ, మరోవైపు ముస్లింలు బిసిల్లో ఉండకూడదు అని చెప్పడం -ఇది ఏ విధమైన న్యాయం? తెలంగాణలో బిసిల రిజర్వేషన్లు 42%కు పెంచే ప్రయత్నాలను కేంద్రంలో ముస్లింలు అందులో ఉన్నారనే పేరుతో అడ్డుకుంటూ, మరోవైపు ముస్లింల పేరుతో భయాలు సృష్టించడం. ఇది స్పష్టమైన రాజకీయ వ్యూహం.

టి. చిరంజీవులు

విశ్రాంత ఐఎఎస్,

(బిసి మేధావుల ఫోరం చైర్మన్)