
మీ గుండె ఆరోగ్యం కోసం ఉప్పు విషయంలో చేయాల్సిన ఒక చిన్న మార్పు మీకు ఎంతో మేలు చేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో రకాల డైట్లు, కష్టమైన వ్యాయామాలు చేస్తుంటాం. కానీ, మన ఇంట్లో వాడే ఉప్పులో విషయంలో ఒక చిన్న మార్పు చేస్తే గుండె జబ్బుల నుండి తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు మనం రోజూ వాడే సాధారణ ఉప్పు(sodium)కు బదులుగా పొటాషియం ఉన్న ఉప్పును వాడాలి.
ఎందుకంటే సాధారణ ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తపోటును(బిపి) పెంచుతుంది. అదే పొటాషియం ఉన్న ఉప్పు వాడితే బిపి అదుపులో ఉంటుంది. దీని వల్ల ప్రయోజనం ఏంటంటే.. రోజుకు కేవలం 1,000 మిల్లీగ్రాముల సోడియం తగ్గించినా సరే.. గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది.
అధ్యయనం ఏం చెబుతోందంటే
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2003 నుండి 2020 వరకు చేసిన పరిశోధనలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఉప్పు మార్చడం వల్ల ఇంత మేలు జరుగుతుందని తెలిసినా, వందలో 6 గురు మాత్రమే ఈ పొటాషియం ఉప్పును వాడుతున్నారు. హై బిపి ఉన్నవారు కూడా అదే ఉప్పునే వాడుతున్నారు కానీ మార్పు చేయడం లేదు. పొటాషియం ఉన్న ఉప్పు రుచి కొంచెం తేడాగా ఉండటం లేదా అవగాహన లేకపోవడం వల్ల చాలామంది దీనిని పట్టించుకోవడం లేదు.
వైద్య నిపుణుల హెచ్చరిక ఏంటంటే కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్న వారు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే ఉప్పును మార్చాలి. ఎందుకంటే వారికి ఎక్కువ పొటాషియం ప్రాణాపాయం కావచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్న మిగతా వారికి ఇది చాలా సురక్షితమైన పద్ధతి.
మొత్తంగా మనం తినే జంక్ ఫుడ్, హోటల్ తిళ్ల ద్వారానే ఎక్కువ ఉప్పు ఒంట్లోకి చేరుతుంది. ఇంట్లో వాడే ఉప్పును మార్చుకోవడం అనేది మన గుండెను కాపాడుకోవడానికి మన చేతుల్లో ఉన్న అత్యంత తక్కువ ఖర్చుతో సులభమైన మార్గం. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ ఉప్పు తగ్గించండి, వీలైతే డాక్టర్ సలహాతో పొటాషియం ఉప్పును వాడండి. మీ గుండెను హాయిగా ఉంచుకోండి.