
టెహ్రాన్: ఓ వైపు అమెరికా యుద్ధం ఆపుదాం.. కూర్చొని మాట్లాడుకుందాం అంటుంటే.. మరోవైపు ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. తమపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నాకే ఏదైనా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు తమపై దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ తాజాగా మరో సంచలనానికి తెరలేపింది.
ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా 2026, ఏప్రిల్ 1 నుంచి అమెరికాలోని ప్రధాన టెక్ సంస్థలు, పారిశ్రామిక కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ శక్తివంతమైన సైనిక దళం ఐఆర్జీసీ (ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్) ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్, ఐబిఎం, టెస్లా, బోయింగ్‌తో సహా 18 కంపెనీల తమ హిట్ లిస్టులో ఉన్నాయని తెలిపింది.
ఆయా కంపెనీలు తమ దాడులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఇకపై ఉగ్రవాద లక్ష్యాలను రూపొందించడం, పసిగట్టడంలో అమెరికన్, ఐసీటీ, ఏఐ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున.. ఈ ప్రధాన సంస్థలే మా చట్టబద్ధమైన లక్ష్యాలు అవుతాయని స్పష్టం చేసింది. ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ సంస్థల ఉద్యోగులు వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని హెచ్చరించింది.
ఇరాన్‌కు అమెరికా వార్నింగ్:
ఇరాన్ కంటే ముందు అమెరికా ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెల రోజులుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో ఇరాన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని లేదంటే మునుపటి కంటే తీవ్రమైన సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఇరాన్‌పై యుద్ధం విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరి దృఢంగా ఉందని స్పష్టం చేసింది.
ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం (మార్చి 31) మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇరాన్ తెలివైనదైతే డీల్‌కు అంగీకరించాలి.. లేదంటే ఆ దేశం మరింత తీవ్రమైన దాడులను ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు.
సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ నేతృత్వంలోని ఇరాన్ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కొంచెం తెలివిగా వ్యవహారించాలని హితవు పలికారు. అమెరికా దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా బలహీనపరిచాయని.. ఎంతలా అంటే ఇరాన్ సైనికులు నైతిక స్థైర్యం దెబ్బతిని సాయుధ దళాల నుంచి పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
అమెరికా దాడులతో ఇరాన్ సైనిక నాయకత్వంలో ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఇక, ఇరాన్ మిస్సైల్ దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా పూర్తి సంసిద్ధంగా ఉందని తెలిపారు. ట్రంప్ షరతులపై మాత్రమే ముగిసే ఈ యుద్ధంలో రాబోయే రోజులు నిర్ణయాత్మకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్‌లో భూతల దళాలను మోహరించే ఉద్దేశం అమెరికాకు లేదని.. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని బహిరంగంగా వెల్లడించబోమని హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు.