
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సీతారాంనగర్ తాండా గ్రామపంచాయితీ పరిధిలోని పులిగోనిపల్లి తాండాలో మంగళవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త భార్య, కుమారుడు, కూతురును రోకలితో హతమార్చగా భార్య, కుమారుడు సంఘటన స్థలంలోనే మృతిచెందగా, కోన ప్రాణాలతో కూతురు ఉస్మానియా ఆసుపత్రిలో కోట్టుమిట్టాడుతుంది. ఆమనగల్లు ఇన్స్‌పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) సందా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు ఆమనగల్లు మండలం పులిగోనిపల్లి తాండాకు చెందిన బాణావత్ రాందాస్‌నాయక్ ఆమనగల్లు పట్టణ సమీపంలోని కాటన్‌మిల్లులో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తూ తాండాలో భార్య కవిత, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు. రాందాస్‌నాయక్ మద్యానికి బానిసై భార్యత కవితతో తరచు గోడవ పడేవాడని, ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భార్య కవిత (28), కూతురు ప్రణీత (9), కుమారుడు హర్షిత్ (7)లను రోకలితో తీవ్రంగా దాడి చేసి హతమార్చాడు.
ప్రణీత తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ ఉస్మానియాకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు. రెండవ కూతురు పవిత్ర తన నానమ్మ ఇంట్లో ఉన్నట్లు, మొదటి కూతురు పావని ఆమనగల్లు ప్రభుత్వ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంఘటన గురించి చుట్టు పక్కన ఉన్నవారు చూసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోని వివరాలను సేకరించినట్లు తెలిపారు. మృతురాలి సోదరి కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తల్లి, కుమారుడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పుత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, గంగాధర్, జానకిరాంరెడ్డిలు సందర్శించారు. క్లూస్ టీం వివరాలను సేకరించింది.