Reading Time: 2 minutes

కూలికోసం, కూటికోసం పట్టణంలో బతుకుదామని పొట్ట చేతపట్టుకుని వచ్చే గిగ్ వర్కర్లకు అనుదినం కష్టాలే. ఎంత ఎదిగినా గొర్రె తోక బెత్తెడే అన్న చందంగా ఎంత కష్టపడినా చాలీచాలని వేతనం, ఒత్తిడితో కూడిన పని విధానం వారిని కుంగదీస్తున్నాయి. గిగ్ ఎకానమీ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నా, ఆ రంగానికి చెందిన కార్మికుల పట్ల యాజమాన్యాలదీ, ప్రభుత్వాలదీ చిన్నచూపే. వారి పరిస్థితి రోజువారీ కూలీల కంటే హీనంగా, దీనంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చే దిశగా, రాష్ట్రంలో పనిచేస్తున్న నాలుగు లక్షలమంది గిగ్ వర్కర్ల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం రూపుదిద్దిన గిగ్ వర్కర్ల నమోదు, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లు స్వాగతించదగినది. త్వరలో చట్టరూపం దాల్చనున్న ఈ బిల్లు అమలులోకి వస్తే, ఇకపై నమోదు చేసుకున్న కార్మికులకు ఐడి కార్డుతోపాటు పింఛను, బీమా, ప్రసూతి ప్రయోజనాలు లభిస్తాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సంక్షేమ బోర్డు గిగ్ వర్కర్లకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. కార్మికులకు వేతనాలు చెల్లించని అగ్రిగేటర్లపై కొరడా ఝళిపిస్తుంది. సమస్యల పరిష్కారంలో కార్మికులకు సహకరించడంతోపాటు అపిలేట్ అథారిటీని సైతం నియమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయడం హర్షణీయం.

భారత ఆర్థిక వ్యవస్థకు గిగ్ కార్మికులు ‘కనిపించని చక్రాలు’ (ఇన్విజిబుల్ వీల్స్)గా అభివర్ణించడం కద్దు. కానీ వారి జీవితం మాత్రం చుక్కాని లేని పడవ లాంటిది. ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, వేతనంతో కూడిన సెలవులు, పనివేళలు లేకపోవడంతోపాటు పని ప్రదేశాల్లో వివక్ష, ఒత్తిడి గిగ్ వర్కర్లను కుంగదీస్తున్నాయి. పని లేని రోజున పస్తులు ఉండక తప్పడం లేదు. ఈ రంగంలో పనిచేస్తున్నవారిలో అధిక శాతం అవివాహితులే. పైగా ఇతర ప్రాంతాలనుంచి పట్టణాలకు వలస రావడంతో రేషన్ కార్డులకు సైతం నోచుకోవడం లేదు. గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళా కార్మికులకు భద్రత కరవైంది. మన దేశంలో గిగ్ వర్కర్ల పరిస్థితిలో ఎదుగూబొదుగూ లేదంటూ తాజా ఆర్థిక సర్వే సైతం కళ్లకు కట్టిన సంగతి గమనార్హం. నలభై శాతం మంది ఆన్‌లైన్ డెలివరీ వర్కర్ల వేతనం నెలకు 15వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువేనని ఆందోళన వ్యక్తం చేస్తూ, వీరికి న్యాయమైన వేతనాలు, వెయిటింగ్ పీరియడ్ లో పరిహారంతోపాటు గంటకు లేదా ప్రతి పనికీ కనీస ఆదాయం ఉండాలంటూ పలు సూచనలు, సలహాలు ఇచ్చింది.

గత పదేళ్లుగా గిగ్ ఎకానమీ దినదినాభివృద్ధి చెందుతోంది. గత ఏడాది ప్రపంచ గిగ్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 47 లక్షల కోట్ల రూపాయలని అంచనా. కానీ, ఇందుకు మూలకారకులైన గిగ్ వర్కర్ల సంక్షేమంపట్ల పాలకులు కనబరుస్తున్న చిత్తశుద్ధి చాలా తక్కువ. ఈ దిశగా ముందుగా కళ్లు తెరిచిన ఘనత రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కుతుంది. మూడేళ్ల క్రితమే గిగ్ వర్కర్ల కోసం పటుతరమైన చట్టాన్ని రూపొందించి, అమలు చేస్తోంది. ఆ తర్వాత కర్నాటక, జార్ఖండ్ రాష్ట్రాలలోను చట్టాలు రూపొందాయి. ఈ జాబితాలో తాజాగా తెలంగాణ చేరడం ముదావహం. సంఘటిత, అసంఘటిత రంగాలలో ఉద్యోగి- యజమాని సంబంధం లేకుండా స్వయంగా ఆదాయార్జన చేసేవారే గిగ్ వర్కర్లు అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక సందర్భంలో నిర్వచనం ఘనంగానే చెప్పినా, వారి సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు ఎంతమాత్రం చాలవనే చెప్పాలి.

ఆ మధ్య గిగ్ కార్మికులు జరిపిన మెరుపు సమ్మె అనంతరం నాలుక కరచుకుని, ముసాయిదా నిబంధనలకు రూపకల్పన చేసిన కేంద్రం వాటి అమలులో నత్తనడకన నడుస్తూండటం క్షమించరానిది. 2047 నాటికి మన దేశంలో ఆరుకోట్ల మంది గిగ్ కార్మికులు పనిచేస్తారని వీవీ గిరి కార్మిక కేంద్రం జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో అలరారుతున్న భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి రానున్న కాలంలో గిగ్ వర్కర్లే కీలకపాత్ర పోషించనున్నారు.

ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలు సైతం రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాలు చూపిన బాటలో నడుస్తూ, గిగ్ వర్కర్ల సంక్షేమంకోసం పటుతరమైన చట్టాలు రూపొందించి, అమలు చేయాలి. అంతకుమించి, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దదిక్కుగా గిగ్ వర్కర్ల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకత్వం నెరపాలి. ఇంటర్మీడియెట్ విద్యార్హతతోనే ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న కార్మికులకు సామాజిక భద్రతతోపాటు నైపుణ్య శిక్షణ, డిజిటల్ అక్షరాస్యత కల్పించాలి. పది నిమిషాలలోపు డెలివరీ వంటి నిబంధనలను రూపుమాపి, కార్మికులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే.