
- నాగిరెడ్డి కుంట చెరువుకు రక్షణ
- కన్నేసిన రియల్ ఎస్టేట్ సంస్థలు, మాజీ కౌన్సిలర్
- హైడ్రా యాక్షన్తో 8.24 ఎకరాల చెరువు సేఫ్
- బౌరంపేట, ఘట్కేసర్లో కూడా ఆక్రమణలకు విముక్తి
- నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్లో 300 గజాల్లో ఆక్రమణలు తొలగింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని నాలుగు చోట్ల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో ఓ చెరువును ఓ రియల్ఎస్టేట్సంస్థ ఆక్రమించేందుకు యత్నించగా అడ్డుకుని కాపాడింది. 8.24 ఎకరాల నాగిరెడ్డి కుంటను బడా నిర్మాణ సంస్థలు కబ్జా చేయాలని చూడగా వారికి గండికొట్టింది. గ్రామ, రెవెన్యూ రికార్డులతో పాటు 8.24 ఎకరాల చెరువుగా గతంలోనే హెచ్ఎండీఏ గుర్తించింది.
అయితే, చెరువు కనిపించకుండా 20 ఫీట్ల టిన్ షీట్స్‌తో ప్రహరీ నిర్మించి 4 ఎకరాలకు ఎన్ సీసీ రియల్ ఎస్టేట్ సంస్థ ఫెన్సింగ్ వేసింది. 20 ఫీట్ల రేకులతో అడ్డుగా కట్టి లోపల చెరువు కనించకుండా చేసింది. మరో వైపు ఇంకో నిర్మాణ సంస్థ కూడా 3 ఎకరాలను కబ్జా చేసింది. స్థానిక మాజీ కౌన్సిలర్ కూడా ఎకరానికిపైగా కబ్జా చేసి వేరేవాళ్లకు అమ్మేశారు. ఇలా 8.24 ఎకరాల చెరువును కబ్జా చేసి అమ్ముకునే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది.
ప్లాట్లుగా మార్చుకొని ప్రీకాస్ట్ ఇటుకలతో ప్రహరీతో పాటు అక్కడి నిర్మించిన తాత్కాలిక గదులు హైడ్రా తొలగించింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది. దీని విలువ దాదాపు రూ.900 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
మేడ్చల్- మల్కాజిగిరిలో రెండు చోట్ల…
మేడ్చల్–- మల్కాజిగిరి జిల్లా దుండిగల్ – గండిమైసమ్మ మండలం బౌరంపేట గ్రామ పరిధిలో గండిమైసమ్మ–మియాపూర్ ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన షాపులను హైడ్రా తొలగించింది. 150 అడుగుల ప్రధాన రహదారికి ఇరువైపులా ఓ వ్యక్తి ఆక్రమణలకు పాల్పడి తాత్కాలిక షెడ్డులు వేసి అద్దెలకు నడుపుతున్నాడనే ఫిర్యాదులపై ఆరా తీసిన హైడ్రా 10 షాపులను తొలగించింది. అలాగే ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామ పరిధిలో 68వ సర్వే నంబరులో 1987లో 60 ఎకరాల మేర లే ఔట్ వేశారు.
ఇందులో 1440 గజాల స్థలాన్ని పార్కుకోసం కేటాయించారు. తర్వాత కొన్నాళ్లకు దానిని ప్లాట్లుగా మార్చి 6 ప్లాట్లు చేశారు. ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. అమ్మకాలు జరుగుతున్న సమయంలోనే పార్కు స్థలమంటూ హైడ్రా అడ్డుకుకోవడంతో పాటు పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఈ రెండింటి విలువ దాదాపు రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
జూబ్లీహిల్స్ లో 300 గజాలు..
జూబ్లీహిల్స్ సొసైటీకి గతంలో ప్రాతినిధ్యం వహించిన వారు వరద కాలువలున్నా పట్టించుకోకుండా ప్లాట్లుగా సృష్టించారు. 120 గజాల ఓ ప్లాట్, 180 గజాలతో మరో ప్లాట్ సృష్టించి అమ్మేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్ట్రేషన్ కూడా అయ్యాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఓ ప్లాట్ యజమాని ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జీహెచ్ ఎంసీ అధికారులతో పాటు సంబంధిత శాఖలతో కలిసి హైడ్రా విచారించింది.
మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వరద కాలువతో పాటు జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వైపు నుంచి వచ్చే మరో వరద కాలువ బాక్స్ డ్రైన్లుగా ఉన్నాయి. బాక్సు డ్రైన్లు ఉంటుండగా పైన నిర్మాణాలు చేసేద్దామని ఆలోచనలో ఉన్నట్టు తేలింది. టిన్ షీట్స్‌తో ప్రహరీలు నిర్మించి లోపల వాచ్‌మ్యాన్‌కు గదులు నిర్మించగా వాటిని హైడ్రా మంగళవారం తొలగించింది. ఈ భూమి విలువ రూ.6 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.