Reading Time: < 1 minute

పసుపు తడిసినా కొనాల్సిందే.. తూకంలో కోతలు విధించవద్దు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం

Caption of Image.
  • ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలి
  • రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు

హైదరాబాద్: అకాల వర్షాల నేపథ్యంలో పసుపు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. బలమైన గాలులు, వర్షాల వల్ల తేమకు గురైన పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారుల ను ఆదేశించారు. వర్షానికి తడిసిన పసుపును తూకంలో కోతలు విధించకుండా, ప్రభుత్వం నిర్ణయించిన మేలురకం ధరకే కొనుగోలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. తేమ శాతం లేదా కోతల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే మార్కెట్ యార్డు సిబ్బందిపై, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చ రించారు. 

మరో వైపు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు సుమారు 27,400 బస్తాల పసుపు చేరుకుంది. ఇందులో దాదాపు 500 కుప్పలు బహిరంగ ప్రదేశాల్లో రాశులుగా ఉన్నాయి.  2026 మార్చి 30న కురిసిన వర్షానికి 40 మంది రైతులకు చెందిన 80 కుప్పలు తేమకు గురయ్యాయి. బయట ఉన్న పసుపు కుప్పలను కాపాడేందుకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 1,500 టార్పాలిన్లను పంపిణీ చేసేందుకు బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.

ఘనంగా రైతు నేస్తం 88వ ఎపిసోడ్

రాష్ట్రవ్యాప్తంగా రైతులను నూతన సాంకేతికతలు, ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించేందుకు నిర్వహించిన రైతు నేస్తం 88వ ఎపిసోడ్ ను నిర్వహించారు. దీనిలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో నానో యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. యూరియా యాప్ ద్వారా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా అవసరమైన యూరియా మోతాదును రైతులు సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ, నానో యూరియా, నానో డి.ఏ.పీ వినియోగం మరియు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. మే 4 నుండి 9 వరకు నిర్వహించనున్న రైతు ఉత్సవాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.