
ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆర్థిక సంవత్సరంలో సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపే కీలక మార్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంటగది నుంచి టాక్స్ ఫైలింగ్ వరకు మారిన రూల్స్ ఇవే..
1. కమర్షియల్ గ్యాస్ ధరల పెంపు: దేశంలోని ఆయిల్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు వాడే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.218 పెంచాయి. దీనివల్ల ఢిల్లీలో సిలిండర్ ధర రూ.2078.50కు, చెన్నైలో రూ.2246.50కు చేరింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
2. విమాన ప్రయాణం భారం: విమాన ఇంధనం ధరలు రెట్టింపు అయ్యాయి. మెట్రో నగరాల్లో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర సుమారు రూ.లక్షా 94వేల నుండి రూ.2లక్షల 14వేల మధ్యకు చేరింది. దీనివల్ల విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
3. రైల్వే టికెట్ రద్దు రూల్స్: ట్రైన్ టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని రైల్వే కుదించింది. ఇకపై రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు మాత్రమే టికెట్ క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. గతంలో ఇది 4 గంటలుగా ఉండేది. బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడానికి 30 నిమిషాల సమయం ఉంటుంది.
4. ఫాస్ట్‌ట్యాగ్ బాదుడు: నేషనల్ హైవేస్ అథారిటీ ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను 2.5% పెంచింది. అంటే రూ.3వేలుగా ఉన్న పాస్ ధర ఇప్పుడు రూ.3,075లకు పెరిగింది.
5. టోల్ ప్లాజాల వద్ద నో క్యాష్: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేశారు. కేవలం ఫాస్ట్‌ట్యాగ్ లేదా యూపీఐ ద్వారానే పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది.
6. వాహనాల ధరల పెంపు: ఏప్రిల్ 1 నుంచి కార్లు, కమర్షియల్ వాహనాల ధరలు 2% నుంచి 3% పెరిగాయి. పాత బుకింగ్స్ ఉన్నా.. మార్చి 31లోపు బిల్లింగ్ అవ్వకపోతే కొత్త ధరలే చెల్లించాల్సి ఉంటుంది.
7. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025: ఇకపై ‘ఫైనాన్షియల్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్’ అనే పదాలకు బదులుగా “టాక్స్ ఇయర్” అనే పదాన్ని ఉపయోగిస్తారు.
8. సెక్షన్ 87A కింద ఊరట: కొత్త పన్ను విధానంలో శాలరీడ్ ఉద్యోగులకు రూ.12.75 లక్షల వరకు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
9. ఫామ్ 16 స్థానంలో కొత్త ఫామ్స్: గతంలో ఉన్న ఫామ్ 16, 16A స్థానంలో ఫామ్ 130, 131 అందుబాటులోకి వచ్చాయి. ఇవి మరింత వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాయి.
►ALSO READ | ఇండియాలోనే 12 వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేసిన ఒరాకిల్.. మరో రౌండ్ ఉందంటూ వార్తలు..!
10. HRA రూల్స్: ఇంటి అద్దె మినహాయింపు కోసం రెంట్ రసీదులు తప్పనిసరి. ఏడాదికి లక్ష దాటితే యజమాని పాన్ కార్డ్ ఇవ్వాలి. బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ నగరాలను కూడా 50% ఎగ్జెంప్షన్ కేటగిరీలో చేర్చారు.
11. పీఎన్‌బీ విత్‌డ్రా లిమిట్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లాసిక్ డెబిట్ కార్డులపై రూ.25వేలు, ప్లాటినం కార్డులపై రూ.50వేలు విత్‌డ్రా పరిమితి విధించింది.
12. ట్రేడింగ్ ఖరీదు: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ పెరిగింది. ఫ్యూచర్స్‌పై 0.05%, ఆప్షన్స్‌పై 0.15% పన్ను వసూలు చేస్తారు.
13. గోల్డ్ బాండ్లపై పన్ను: ఆర్‌బీఐ నుంచి నేరుగా కొన్న సావరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఇకపై సెకండరీ మార్కెట్లో కొన్న వాటికి క్యాపిటల్ గెయిన్ టాక్స్ వర్తిస్తుంది.
14. వేతన చట్టం: ఉద్యోగి మొత్తం జీతంలో బేసిక్ శాలరీ కనీసం 50% ఉండాలి. దీనివల్ల చేతికి వచ్చే జీతం తగ్గినా, పీఎఫ్, గ్రాట్యుటీ పెరుగుతాయి.
15. సెటిల్మెంట్ వేగవంతం: ఉద్యోగం వదిలేసిన తర్వాత కంపెనీలు కేవలం 2 పని దినాలలో పూర్తి సెటిల్మెంట్ పూర్తి చేయాలి రాజీనామా చేసిన ఉద్యోగుల విషయంలో.
16. పాన్ కార్డుకు ఆధార్ వద్దు: పాన్ కార్డు దరఖాస్తుకు పుట్టిన తేదీ ధృవీకరణ కోసం ఆధార్ కార్డును ఇకపై పరిగణించరు. బదులుగా బర్త్ సర్టిఫికేట్ లేదా 10వ తరగతి మార్క్స్ షీట్ సమర్పించాలి.