
న్యూఢిల్లీ: దేశంలో కమర్షియల్ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.195.50 పెరిగింది. కోల్‌కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.218 పెరిగింది. ఈ పెరిగిన ధరలు నేటి (ఏప్రిల్ 1, 2026) నుంచే అమల్లోకి రానున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. కమర్షియల్ సిలిండర్ల కొరతతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారులకు ధరలు పెరగడంతో.. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లయింది.
The 19 kg commercial LPG gas cylinder will become costlier starting today. In Delhi, the price of a 19 kg cylinder has increased by Rs 195.50, and in Kolkata by Rs 218, effective from today, 1 April: Sources pic.twitter.com/gYu6qbVbq1
— ANI (@ANI) April 1, 2026
ప్రభుత్వ రంగ చమురు సంస్థల ప్రకారం.. రేట్లు పెరిగాక ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరింది. కమర్షియల్ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లకు ఈ పెంపు తలకు మించిన భారంగా మారింది. పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి.
మార్చి 1నే మన దేశంలో కమర్షియల్ సిలిండర్ల ధరను 115 రూపాయలు పెంచారు. ఒక నెల వ్యవధిలోనే ఏప్రిల్ 1న మళ్లీ 200 రూపాయలు పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు దిక్కు తోచని పరిస్థితి. యుద్ధం మొదలయ్యాక కమర్షియల్ సిలిండర్ల ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.