
బస్తర్ (ఛత్తీస్‌గఢ్): గత కొన్ని నెలలుగా మావోయిస్టులు గుంపులు గుంపులుగా పోలీసు అధికారుల ముందువ లొంగిపోతున్నారు. తాజాగా మరికొంతమంది మావోలు సరెండర్ అయ్యారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని (LWE) నిర్మూలించడానికి కేంద్రం విధించిన గడువుకు కొన్ని గంటల ముందు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నలుగురు మహిళలతో సహా ఏడుగురు మావోయిస్టులు మంగళవారం తమ ఆయుధాలతో లొంగిపోయారు. బస్తర్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఏడుగురు మావోలు లొంగిపోయారని పోలీసులు తెలిపారు.
దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన ఐదుగురు కేడర్లు దంతేవాడలోని పోలీస్ లైన్స్‌లో సీనియర్ పోలీసు, CRPF అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వ్యక్తులపై సమిష్టిగా రూ. 9 లక్షల రివార్డు ఉంది. వీరిలో భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సభ్యుడు, 42 ఏళ్ల సోమ్ కడ్తిపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. మరో నలుగురు.. లఖ్మా ఓయం (19), సరితా పోద్యం (21), జోగి కల్ము (20), మోతీ ఓయం (19)ల తల మీద ఒక్కొక్కరికీ లక్ష రూపాయల రివార్డు ఉంది.
భారీగా ఆయుధాలు స్వాధీనం
పునరావాస పథకం కింద లొంగిపోవాలని ఈ బృందం నిర్ణయించుకుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేడర్లు అందించిన సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు ఆ ప్రాంతంలోని మావోయిస్టుల రహస్య స్థావరాల నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, ఒక కార్బైన్, ఒక .303 రైఫిల్, అనేక బీజీఎల్ లాంచర్లతో సహా 40 ఆయుధాలు ఉన్నాయి.
అలాగే, కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో, శంకర్, హిద్మా దోడి అనే మరో ఇద్దరు మావోయిస్టులు కూడా లొంగిపోయారు. వారిలో ఒకరు అధికారులకు ఏకే-47 రైఫిల్‌ను అప్పగించారు.