Reading Time: < 1 minute

రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఎయిమ్స్ బీబీనగర్ వద్ద ఆరులైన్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ట్రాఫిక్ జామ్‌తో అత్యంత క్లిష్టంగా ఉన్న ఈ ప్రాంతంలో భారీ ఆరు లైన్ల ఎలివేటెడ్ ఫ్లై ఓర్లు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు అవకాశం కలిగింది. ఈ ప్రాజెక్టు వల్ల వరంగల్ హైవేపై ట్రాఫిక్ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవుతుందని అంచనా. జాతీయ రహదారి 163పై ట్రాఫిక్ భద్రత, సౌకర్యాల మెరుగుదల లక్ష్యం చేపడుతున్న ఈ ప్రాజెక్టును రూ.98.26 కోట్ల వ్యయంతో 23 స్పాన్లతో 690 మీటర్లు పొడవైన ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఎయిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేట్, ఎమర్జెన్సీ గేట్లకు రాకపోకలకు సులభంగా ఉండేవిధంగా 1.70 కిమీ పరిధిలో పనులు చేపడతారు. హైవే రెండు వైపులా 1.48 కి.మీ సర్వీస్ రోడ్లు నిర్మాణంతో పాటు హైస్పీడ్ ట్రాఫిక్, ఆసుపత్రికి వచ్చే వాహనాల రాకపోకలు వేరు చేసేలా ప్రణాళికను రూపొందించారు.

దీనికి తోడు ఆధునిక లైటింగ్, బస్ షెల్టర్లు, ట్రాఫిక్ సైన్లు, సేఫ్టీ మార్కింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు కల్వర్టుల పునర్నిర్మాణం కూడా చేపడతారు. ప్రమాదాల నివారణతో పాటు భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఫ్లై ఓవర్ రూపకల్పన జరుగుతోందని హైవే అథారిటీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా హైదరాబాద్- నుంచి యాదాద్రి ఎన్‌హెచ్163 పై బీబీనగర్ ఎయిమ్స్ వద్ద తరచుగా జరిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2019.-21 మధ్యకాలంలో జాతీయ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రదేశంగా గుర్తించి, ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉందని కేంద్రానికి నివేదించింది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశంగా గుర్తించి నివారణ కోసం ఇక్కడ ఫ్లై ్లఓవర్ నిర్మాణం చేపట్టాలని సూచించింది. ఈ నివేదిక ఆధారంగానే ఎన్‌హెచ్‌ఐ ఈ ఆరు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.