
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయి చాచాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసిందన్నారు. కాగ్ 2024-25 నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెల్లడించిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు సంపద పెంచుతాం.. పేదలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.
2024 -25 ఆర్థిక సంవత్సరంలో రెండు రోజులు మినహా మిగతా అన్ని రోజులు ఆర్బీఐ నుంచి చేబదులుగా డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని నెట్టుకురావడం సిగ్గుచేటని అన్నారు. ఏడాది కాలంలో రూ.1.30 లక్షల కోట్లు చేబదులు అప్పులు తెచ్చి సర్కారును నడిపించటమంటే కచ్చితంగా అది చేతకాని తనమే అని విమర్శించారు. తెచ్చిన అప్పుల్లో మరో 6 వేల కోట్లు ఆర్థిక సంవత్సరం ముగిసినా చెల్లించలేదనే విషయాన్ని కాగ్ బట్టబయలు చేసిందని చెప్పారు. నెలకు రూ. 12 వేల కోట్ల సొంత ఆదాయం ఉన్న తెలంగాణలో రోజువారీ కనీస అవసరాల కోసం రూ. 1.38 కోట్ల బ్యాలెన్స్ కూడా మెయింటెన్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు.