
అమరావతి: దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి ప్రజల రాజధాని కాదు అని, స్కామ్‌ల రాజధాని అని మండిపడ్డారు. తాడేపల్లిలో వైసిపి పార్టీ కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ అమరావతిలో జరుగుతోందని, 2018లో ఎవరు ఏ పనులు చేశారో, 2024 తర్వాత అవే కంపెనీలకు బాధ్యతలు అప్పగించారని దుయ్యబట్టారు. ఫైవ్‌స్టార్ నిర్మాణాల్లో కూడా చదరపు అడుగుకు రూ.4,500 మించదని, వీళ్లు చేసే దోపిడీ ముందు వీరప్పన్ కూడా సరిపోడుని ధ్వజమెత్తారు. రాజధానిపై తీర్మానం అవసరం లేదని మంత్రి పార్థసారథి స్టేట్‌మెంట్ ఇచ్చారని, రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అనే పదం ఉందా? అని ప్రశ్నించారు.
రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదని, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని, ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయని గుర్తు చేశారు. చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని, పరిపాలన అంటే బాబు దృష్టిలో దోపిడీ, అవినీతి మాత్రమేనని విమర్శించారు. చంద్రబాబు సిఎంగా ఉండటం ఎపి ప్రజలు చేసుకున్న దురదృష్టమని, అమరావతి చట్టబద్ధత తీర్మానం విషయంలోనూ డ్రామాలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసే దోపిడీ నుంచి డైవర్ట్ చేసేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏడేళ్లు చంద్రబాబు సిఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఇప్పటి వరకు ఎంత నిర్మించావు అని అడిగారు. ఏ దేశానికి పోతే.. ఆ దేశంలో అమరావతి బొమ్మలు చూపిస్తూ ఇదిగో ఇలా ఉంటుందని చెబుతావు కానీ ఆచరణలో అవి కనిపించడం లేదని చురకలంటించారు. కనీసం అమరావతి రైతులకు ఇచ్చిన హామీలనైనా నెరవేర్చావా చంద్రబాబు అని నిలదీశారు. అమరావతిని చంద్రబాబు తన సొంత వ్యవహారంలా నడిపిస్తున్నారని, ఫేజ్ ల వారీగా దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారని, 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు.