Reading Time: < 1 minute
ఎంత దారుణం.. రైతు ఆశలపై నిప్పులు పోసిన దుండగులు.. కళ్లముందే కాలిబూడిదైన శనగ పంట

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో, ఎవరో చేసిన దుర్మార్గం ఒక రైతు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూరు తండాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ముత్నూరు తండాకు చెందిన రాం ప్రకాష్ అనే రైతు తన పొలంలో శనగ పంటను సాగు చేశాడు. పంట కోత కోసి, కుప్పగా వేసి విక్రయానికి సిద్ధం చేసుకున్నాడు. అకాల వర్షాల భయంతో పంటను జాగ్రత్తగా చూసుకోవడానికి అతడు రాత్రి పూట పొలంలోనే కాపలా ఉంటున్నాడు. అయితే, అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ శనగ కుప్పకు నిప్పు పెట్టారు.

మంటల వేడి తగలడంతో నిద్రలో ఉన్న రాం ప్రకాష్ ఉలిక్కిపడి లేచాడు. కళ్లముందే తన పంట తగలబడిపోతుండటం చూసి హాహాకారాలు చేశాడు. చుట్టుపక్కల రైతులు పరుగెత్తుకుంటూ వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, మంటలు అప్పటికే ఉగ్రరూపం దాల్చాయి. ఈ ప్రమాదంలో సుమారు 50 క్వింటాళ్ల శనగ పంట పూర్తిగా కాలిపోయింది. దీని విలువ మార్కెట్‌లో సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఒకవైపు అకాల వర్షాలు పంటను నాశనం చేస్తుంటే, మరోవైపు పగబట్టిన శత్రువులు నా పొట్ట కొట్టారు. అప్పులు చేసి సాగు చేసిన పంట ఇలా బూడిదైతే నేను ఎలా బతకాలి? అంటూ రాం ప్రకాష్ కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని, ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షల వల్ల ఎవరైనా ఈ పని చేశారా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..