
కరీంనగర్ క్రైం, వెలుగు : హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు, రూ. 1500 చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ మంగళవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే… కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామానికి చెందిన తెనుగు కులస్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న బొజ్జ తిరుపతి (48) బొజ్జ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
చేపలు పట్టుకునే విషయంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరగడంతో కేసులు కూడా నమోదయ్యాయి. తిరుపతిపై కక్ష పెంచుకొని ప్రత్యర్థి వర్గ సభ్యులు అతడిని చంపేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా 2019 ఏప్రిల్ 19న సాయంత్రం బొజ్జ తిరుపతి, మరికొందరితో కలిసి ఉండగా.. ప్రత్యర్థి వర్గానికి చెందిన 15 మంది సహా ఓ బాలుడు తిరుపతిపై రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. దీంతో 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో సాక్ష్యులను సీఎంఎస్ ఏఎస్ఐ సత్తయ్య, సీడీవో ఎం.రాజేందర్ కోర్టులో ప్రవేశపెట్టగా పీపీ మల్యాల ప్రతాప్ వాదించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి శివకుమార్ 15 మందికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. బాలుడిపై కేసు జువైనల్ కోర్టులో విచారణలో ఉంది.