Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ మలయాళ డైరెక్టర్ రంజిత్‌కు కోర్టు షాకిచ్చింది. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో నిన్న(మార్చి 31, మంగళవారం) రాత్రి డైరెక్టర్ రంజిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 1, బుధవారం ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు.

దీంతో పోలీసులు సబ్-జైలుకు తీసుకువెళ్తుండగా రంజిత్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆ ఆరోపణలు అబద్ధమని తాను నిరూపించగలనని అన్నారు.

కొచ్చి నగర పోలీస్ కమిషనర్ ఎస్ కళిరాజ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఫిర్యాదు చేసిన నటి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని, బయటకు రావడానికి ముందు ఆమెకు కౌన్సెలింగ్, మానసిక వైద్య సహాయం అవసరమయ్యాయని తెలిపారు. ఆమె వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని.. బాధితురాలి ఆరోపణలను నిర్ధారించుకున్న తర్వాతనే డైరెక్టర్ రంజిత్ ను అరెస్టు చేశామని చెప్పారు.

ఈ కేసులో బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సజి చెరియన్ స్పష్టం చేశారు. “ఇలాంటి చర్యలను ప్రభుత్వం గానీ, సమాజం గానీ అంగీకరించదు” అని ఆయన అన్నారు.