Reading Time: < 1 minute

ప్రజాస్వామ్యయుతంగా మూసీ పునరుజ్జీవం.. ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో అభిప్రాయ సేకరణ: డిప్యూటీ సీఎం భట్టీ

Caption of Image.
  • నిర్వాసితులు, డిఫెన్స్ భూములపై సంప్రదింపులు 
  • విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ 
  • 24 గంటలూ అందుబాటులో కేబినెట్ సబ్ కమిటీ 
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి

మూసీ పునరుజ్జీవ పనులను ప్రజాస్వామ్యయుతంగా చేపడుతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మూసీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సోమవారం (మార్చి 31) సచివాలయం లో జరిగింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్ లైన్ లో musrirde@gmail.com మెయిల్ ఐడీ ద్వారా మూసీ పునరుజ్జీవంపై ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామని తెలిపారు. ఆన్ లైన్ లో వచ్చిన విలువైన సలహాలు, సూచనలను అన్నింటినీ అధికారులతో కలిసి విశ్లేషణ చేస్తామని చెప్పారు. అభిప్రాయాలు వెల్లడించిన వారితో నేరుగా దశలవారీగా సబ్ కమిటీ సభ్యులు సం ప్రదింపులు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. 

మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం పనులకు మార్చి 28న శంకుస్థాపన జరిగిందని, ఆ రోజు నుంచి మూసీ ఫేస్ 1, ఫేస్ 2 వరకు చేయాల్సిన పనులకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. డిఫెన్స్ భూములు, మూసీ నిర్వాసితులతో సంప్రదింపులు, నిర్మాణ డిజైన్లు తుది దశకు తీసుకురావడం, బ్యాంకర్స్ తో మాట్లాడటం ఇలా పనులను ఎక్కడికి అక్కడ విభజన చేసుకొని ముందుకు వెళ్లాలని అధికారులకు  సూచించారు. 

సీఎం రేవంత్ రెడ్డి యావత్ కేబినెట్ సంకల్పాన్ని అర్థం చేసుకొని అధికారులు ఉత్సాహంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ ప్రాజెక్టు ఒక మైలురాయి గా నిలుస్తుందని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. అధికారులకు ఎలాంటి సలహా, సూచన ఇతర ఏ అవసరాలు ఉన్న సబ్ కమిటీ సభ్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. సమావేశంలో స్పెషల్
సీఎస్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, అధికారులు వినయ్ కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, మను చౌదరి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్జన్ తదితరులు పాల్గొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.